బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి అరుణ భాటియా కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో సెప్టెంబర్ 3న ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్షయ్ కుమార్ వెల్లడించారు.
మా అమ్మ అరుణ భాటియా ఈ ఉదయం ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. మా అమ్మ మరణం వల్ల కలిగిన బాధను మాటల్లో చెప్పలేను. ఈ బాధను భరించడానికి వీల్లేకుండా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి అని అక్షయ్ ట్వీట్ చేశారు.
కాగా.. అరుణ భాటియా మరణం పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం తెలియజేశారు.