దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా లక్షల్లో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ను విధించాయి. కరోనా, లాక్‌డౌన్‌తో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ఎంతో ముందుకు వస్తున్నారు. కరోనా తొలి వేవ్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, కత్రినా కైఫ్ తదితరులు సహా అనేక పేదలకు తమ సాయం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో.. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. కరోనా లాక్‌ఢౌన్‌తో ఇబ్బందులు పడుతున్న 1600 మంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వయసు మళ్లిన డాన్సర్లతో పాటు 2000 మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లకు నెల రోజుల పాటు సరిపడ రేషన్ అందించేందుకు ముందుకు వచ్చాడు. ఇందుకోసం కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య షౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నాడు. అవసరం ఉన్న వారు నెల రోజులకు సరిపడా రేషన్ తీసుకోవచ్చు లేదా దానికి బదులు నగదును తీసుకోవడానికి వీలు కల్పించారు.
కాగా.. దీనిపై కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ.. 'అక్షయ్ కుమార్ నిజంగా దయకలిగిన వ్యక్తి. నిన్న నా 50 వ పుట్టినరోజు సందర్భంగా ఏం బహుమతి కావాలని నన్ను అడిగాడు. నేను అతడితో 1600 జూనియర్ కొరియోగ్రాఫర్లు మరియు వృద్ధాప్య నృత్యకారులకు, 2000 మంది బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లకు నెల రోజుల రేషన్‌కు సహాయం చేయగలరా అని అతడిని అడిగాను. అక్షయ్ ఏం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాడు. నిజంగా అతడిది చాలా పెద్ద గొప్ప మనసు. గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా నా భార్య ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటొందని' చెప్పాడు.