'AI'నా మజాకానా.. ఎన్టీఆర్, పవన్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా
AI ద్వారా సృష్టించిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 4:00 PM IST'AI'నా మజాకానా.. ఎన్టీఆర్, పవన్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల అద్భుతాలను సృష్టిస్తోంది. ఇది రావడం ద్వారా ఐటీరంగంలో కొందరికి పని కూడా దొరకదని అనుకున్నారు. ఎందుకంటే మనుషులు చేయాల్సిన పనిని ఈజీగా.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేయొచ్చు. కొంతకాలం ముందు న్యూస్ రంగంలోనూ ఆర్టిఫీషియల్ న్యూస్ రీడర్లు కనిపించారు. మనం అందించే ఇన్‌పుట్ ఆధారంగా ఆర్ట్‌ను కూడా గీసేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతాన్ని చూపించింది ఏఐ టెక్నాలజీ.
ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఓ పిక్ కనిపిస్తుంది. ఇందులో ఏముంది అనుకునే లోపు.. కాస్త పరిశీలించి చూస్తూ ఆర్ట్‌లో దాగివున్న ఎన్టీఆర్ ముఖం కనిపిస్తుంది. ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో కనిపించిన తారకర్ లుక్ AI ఇల్యూషన్ టూల్‌ను వినియోగించి రెడీ చేశారు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న దీని విజువల్ ఎఫెక్ట్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ ఏఐ ఇల్యూషన్ టూల్ సాయంతో క్రియేట్ చేయగా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తారక్, కొరటాల శివ కాంబినేషన్‌లో 'దేవర' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తీర ప్రాంతం ఇతివృత్తంగా వస్తోన్న విషయం తెలిసిందే. అదే లొకేషన్‌ను ఉద్దేశించి ఫొటోలో ఎన్టీఆర్ ఫేస్ క్రియేట్ చేసినట్లు ఉండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ఫొటో కూడా ఇలాంటిదే మరోటి వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో ఉపయోగించిన గన్స్‌ను ఉపయోగించి పవర్ స్టార్ హిడెన్ పిక్‌ను సిద్ధం చేశారు. ముందుగా ఫొటోను చూస్తే గన్స్‌ను కింద పర్చినట్లు కనిపిస్తున్నాయి. కానీ పరిశీలించి చూస్తే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖం కనిపిస్తుంది. ఈ ఫొటోను కూడా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.