అక్కినేని అభిమానుల‌కు పండ‌గే.. ఏజెంట్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Agent Akhil & Mammootty starrer gets new release date.అక్కినేని అఖిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఏజెంట్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2023 3:57 AM GMT
అక్కినేని అభిమానుల‌కు పండ‌గే.. ఏజెంట్ నుంచి క్రేజీ అప్‌డేట్‌

అక్కినేని అఖిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. స్పై థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉండ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు అన్ని అవాంత‌రాలు దాటుకొని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైంది.

వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం ఓ వీడియో ద్వారా తెలియ‌జేసింది. ఈ వీడియోలో అఖిల్‌ను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసినట్లు క‌నిపిస్తోంది. చేతులు, కాళ్లు కట్టేసి, ముఖానికి మాస్క్‌ తొడిగి చిత్రహింసలకు గురిచేస్తుంటారు. నిన్ను ఎవరు పంపారు, పోలీసా, రా(RAW) నా.. ఈ నెట్వర్క్‌లోకి ఎవరు పంపారు. చెప్పు అంటూ ఓ వ్యక్తి అఖిల్‌ను కొడుతుంటాడు. ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఏజెంట్’ కథను వక్కంతం వంశీ రాశారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Next Story