కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విలన్‌గా కనిపించే ప్రముఖ నటుడు సోనూ సూద్.. రియల్ లైఫ్‌లో మాత్రం అందరిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన వారికి లేదనకుండా ఇప్పటికి కూడా సాయం చేస్తూనే ఉన్నాడు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా రోగులు ఎక్కువగా ఆక్సిజన్ దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి బాధను చూడలేని సోనూసూద్.. వీలైనంత మందికి ఆక్సిజన్ అందించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే యూఎస్, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ఫ్లాంట్లు తెప్పించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఫ్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ కంటతడి పెట్టుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే.. కరోనా సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారాయి. ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరక్క ఆక్సిజన్ అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను ఎంతో ఆవేదనకు గురి చేశాయి. తమ కుటుంబ సభ్యుల్ని, ప్రియమైన వారిని కోల్పోయి ప్రతి రోజు ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిస్థితులన్నింటిని చూశాక.. నా తల్లిదండ్రులు సరైన సమయంలోనే కన్నుమూశారని భావిస్తున్నాను. ఒక వేళ వారు కనుక ప్రస్తుతం బతికి ఉండి ఉంటే.. వారికి ఆరోగ్యపరంగా ఏదైన ఇబ్బందులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో బెడ్‌లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడే వాళ్లు ఇది చూసి నా హృదయం తల్లడిల్లేది అంటూ సోనూ సూద్ భావోద్వేగం చెందారు.