కొత్త సంవ‌త్స‌రానికి ముందే శుభ‌వార్త చెప్పిన న‌టి పూర్ణ‌

Actress Poorna announces her pregnancy.కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న వేళ న‌టి పూర్ణ శుభ‌వార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Dec 2022 11:55 AM IST
కొత్త సంవ‌త్స‌రానికి ముందే శుభ‌వార్త చెప్పిన న‌టి పూర్ణ‌

మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న వేళ న‌టి పూర్ణ శుభ‌వార్త చెప్పింది. తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఇందుకు సంబంధించిన ఓవీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శుభ‌వార్త‌ను త‌న కుటుంబ స‌భ్యుల‌తో పంచుకుంటూ సెల‌బ్రేట్‌ చేసుకుంది. అనంత‌రం ఈ వీడియో త‌న సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ప‌లువురు సెల‌బ్రెటీలు, అభిమానులు పూర్ణ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ష‌నీద్ అసిఫ్ అలీని పూర్ణ ఈ ఏడాది వివాహం చేసుకుంది. దుబాయ్‌లో బంధుమిత్రులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది.

'శ్రీ మ‌హాల‌క్ష్మీ' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌. ఆ త‌రువాత అల్లరి నరేశ్ హీరోగా న‌టించిన 'సీమ టపాకాయ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అవును', 'అవును 2', 'లడ్డూబాబు', 'నువ్విలా నేనిలా', 'రాజుగారి గది', 'జయమ్ము నిశ్చయమ్మురా', 'అఖండ' వంటి చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ న‌టిస్తోంది. సినిమాల్లో మాత్ర‌మే కాకుండా బుల్లితెర‌పైన త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. ప‌లు షోల‌కు న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్రస్తుతం నాని హీరోగా తెర‌కెక్కుతున్న‌ 'దసరా' చిత్రంలో పూర్ణ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఇందులో కీర్తి సురేశ్ క‌థానాయిక‌. అలాగే వ్రితం అనే మళయాల చిత్రంలోనూ న‌టిస్తోంది.


Next Story