స్నేహితుడి మోసం.. న‌కిలీ ఎన్‌సీబీ అధికారులు.. డ్ర‌గ్స్ కేసు భ‌యంతో యువ‌న‌టి ఆత్మ‌హ‌త్య‌

Actress ends life after blackmailed by fake NCB staff.రంగుల ప్ర‌పంచంలో తాను నిర్థేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకునే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 3:46 AM
స్నేహితుడి మోసం.. న‌కిలీ ఎన్‌సీబీ అధికారులు.. డ్ర‌గ్స్ కేసు భ‌యంతో యువ‌న‌టి ఆత్మ‌హ‌త్య‌

రంగుల ప్ర‌పంచంలో తాను నిర్థేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో కొంత స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడిప్పుడే న‌టిగా ఆమెకు పేరొస్తుంది. ఆమె నుంచి ఎలాగైనా డ‌బ్బు గుంజాల‌ని ఆమె స్నేహితుల్లో ఒక‌డు చేసిన మోసం కార‌ణంగా న‌కిలీ అధికారుల వేదింపులు త‌ట్టుకోలేక ఓ యువ‌న‌టి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

వివ‌రాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ న‌టి(28) ఈ నెల(డిసెంబ‌ర్‌) 20న ముగ్గురు స్నేహితుల‌తో క‌లిసి ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో పార్టీకి వెళ్లింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన ఇద్ద‌రు న‌కిలీ ఎన్‌సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు దాడులు నిర్వహించారు. అది రేవ్ పార్టీ అని చెప్పారు. డ్ర‌గ్స్ కేసులో ఆమె పేరు బ‌య‌ట‌కు వెళ్లడించ‌కుండా ఉండాలంటే రూ.40ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఆమె ఎలాగోలా ఓ రూ.20ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చింది. అయినా ఆమెను వ‌ద‌ల‌కుండా ప‌దే ప‌దే ఫోన్ చేసి డ‌బ్బుల కోసం విసిగించారు.

దీంతో ఆ యువ‌న‌టి మ‌న‌స్థాపం చెందింది. తాను నివ‌సిస్తున్న రూమ్‌లో ఉరివేసుకుని గురువారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులకు ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం తెలిసింది. న‌టిని బెదిరించి డ‌బ్బు గుంజింది న‌కిలీ వ్య‌క్తులని గుర్తించారు. నిందితులు సూర‌జ్ మోహ‌న్ ప‌ర్దేశి(38), ప్ర‌వీణ్ ర‌ఘునాథ్ వాలింబే(35)ను ఠాణెలో అరెస్ట్ చేశారు. వారిని విచారించ‌గా.. మ‌రిన్ని విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. యువ నటిని పార్టీకి తీసుకెళ్లిన స్నేహితుల్లో.. ఒక‌డి ప‌థకం ప్ర‌కార‌మే రైడ్స్ జ‌ర‌గ‌డం, న‌టిని బెదిరించ‌డం, డ‌బ్బును లాగ‌డం జ‌రిగిందని తెలిసింది. స‌ద‌రు స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. న‌టి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర మైనారిటీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి న‌వాబ్ మాలిక్ ఎన్‌సీబీపై మ‌రోసారి ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్‌సీబీలోని కొంద‌రు అధికారులు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కావాల‌నే బాలీవుడ్ న‌టీన‌టుల‌ను బెదిరించి డ‌బ్బుల‌ను గుంజుతున్నార‌ని ఆరోపించారు.

Next Story