హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
Actor Vishal gets injured while shooting for Mark Antony.తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2022 10:17 AM IST
తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 'పందెం కోడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరయ్యాడు. అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం 'మార్క్ ఆంటోని'. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రస్తుతం చెన్నైలో ఒక షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో ఈరోజు అనుకోని ప్రమాదం జరిగింది.
గురువారం తెల్లవారుజామున చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రథమ చికిత్స అనంతరం విశాల్ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. విశాల్‌కు గాయాలు కావడంతో 'మార్క్ ఆంటోనీ' షూటింగ్‌ను నిలిపివేశారు. తమిళ సినీ వర్గాలు ఈ వార్తను ధ్రువీకరించాయి. విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
కాగా.. సినిమా కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా ముందు ఉంటాడు విశాల్. గతంలోనూ ఆయన పలు చిత్రాల షూటింగ్ సమయాల్లో గాయపడ్డారు. ఇటీవల లాఠీ షూటింగ్‌లోనూ ఆయనకు పలుమార్లు గాయపడిన సంగతి తెలిసిందే.