సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు వినాయకన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వినాయకన్ బహిరంగ ప్రదేశంలో అదుపుతప్పి ప్రవర్తించాడనే ఆరోపణలపై కేరళలో అరెస్టు చేశారు. ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం నానా హంగామా సృష్టించాడు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎర్నాకులం జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో అదుపు లేకుండా ప్రవర్తించడం, పోలీస్ స్టేషన్ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై నటుడిని అరెస్టు చేశారు.
తెలిసిన వివరాల ప్రకారం.. అతను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వద్ద గొడవ సృష్టించినట్లు ఫిర్యాదులు అందడంతో అతన్ని విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు. నార్త్ పోలీస్ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్ హౌస్ ఆఫీసర్) మాట్లాడుతూ.. ''అతను (వినకాయన్) అసభ్యంగా ప్రవర్తించినందున ఈ చర్య తీసుకున్నాం. అరెస్ట్ చేసిన కాసేపటి తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశాం. అతను తాగి ఉన్నాడు'' అని చెప్పారు. వినాయకన్ అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఓ మోడల్‌ని వేధించిన కారణంగా అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలయ్యాడని తమిళ్, మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి.