యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'లైగర్'. ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర విడుదలకు ముందే విజయ్ దేవరకొండ హీరోగా పూరీ.. తన డ్రీమ్ ప్రాజెక్టు 'జనగణమన' ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 'జనగణమన' కు సంబంధించి ఓ చిన్న షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. 'లైగర్' చిత్ర ఎఫెక్ట్ తో 'జనగణమన' చిత్ర షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అటు చిత్రబృందం, ఇటు దర్శకుడు పూరీ ఎవ్వరూ కూడా మాట్లాడడం లేదు. కనీసం ఖండించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ 'జనగణమన' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బెంగళూరు వేదికగా సైమా అవార్డుల వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా 'జనగణమన' గురించి విజయ్‌ను ప్రశ్నించింది. దీనిపై విజయ్ ఇలా స్పందించాడు. "ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరూ వచ్చారు. అందుకనే మీరు ఇక్కడ దాని(జనగణమన) గురించి మర్చిపోండి. సైమాను ఎంజాయ్ చేయండి" అని అన్నాడు. విజయ్ వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం 'జనగణమన' ఆగిపోయినట్లేనని కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడు పూరీ స్పందిస్తేనే కానీ జనగణమన ప్రాజెక్టుపై ఓ క్లారిటీ రాదు.