సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. అనారోగ్యంతో న‌టుడు శ్రీనివాస్ మృతి

Actor Srinu passed away in Srikakulam District.ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 2:28 AM GMT
సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. అనారోగ్యంతో న‌టుడు శ్రీనివాస్ మృతి

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేకముందే మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. టాలీవుడ్ న‌టుడు కొంచాడ శ్రీనివాస్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు. సుమారు 40పైకి చిత్రాల్లో, 10కి పైగా సీరియ‌ల్స్‌లో న‌టించారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో వంటి చిత్రాలు ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బ‌స్టాండ్ కు స‌మీపంలో ఆయ‌న నివాసం ఉంది. ఇక ప్ర‌తి సంక్రాంతికి స్వ‌గ్రామానికి వ‌చ్చి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకునేవార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఓ షూటింగ్ స‌మ‌యంలో శ్రీనివాస్ ఛాతికి దెబ్బ‌త‌గ‌ల‌డంతో.. ఆస్ప‌త్రికి వెళ్ల‌గా అక్క‌డ గుండె స‌మ‌స్య ఉన్న‌ట్లు తెలిసింద‌న్నారు. ఆ కార‌ణంగానే తుదిశ్వాస విడిచిన‌ట్లు చెప్పారు. శ్రీనివాస్‌కు తల్లి విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోగా.. తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇక శ్రీనివాస్ మృతిచెందడంతో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it