లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చి వారికి అండగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. కష్టమనే మాట వినిపిస్తే చాలు లేదనకుండా సాయం చేస్తున్నాడు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ప్రజాసేవను మరవడం లేదు. తనను స్పూర్తిగా తీసుకుని సేవలు చేస్తున్న వారిని సైతం కలుస్తూ వారికి సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన సోనూసూద్.. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 8నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించి పునర్జన్మను ప్రసాదించాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో రామన వెంకటేశ్వరరావు, దేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి 8 నెలల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అయితే..ఆ దంపతులకు చిన్నారి ఆపరేషన్ చేయించే స్తోమత లేదు. దీంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు వారి వివరాలను ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌కు పంపాడు. వెంటనే స్పందించిన సోనూసూద్.. వారిని ముంబై పిలిపించి.. ఆస్పత్రిలో చేర్పించి ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించారు. అందుకు అయిన ఖర్చును ఆయనే భరించారు. తమ చిన్నారి ప్రాణాలను కాపాడినందుకు ఆ దంపతులు.. సోనూసూద్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.