రూ.20 కోట్ల పన్ను ఎగవేసిన సోనుసూద్
Actor Sonu Sood Evaded Tax Of Over ₹ 20 Crore Income Tax Department.బాలీవుడ్ ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనుసూద్
By తోట వంశీ కుమార్
బాలీవుడ్ ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనుసూద్ సుమారు రూ.20కోట్ల మేర ఆదాయపు పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాపన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోనుసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన నాన్ ప్రాఫిట్ సంస్థ ఫారిన్ కాంట్రిబ్యూషన్ చట్టాన్ని ఉల్లంఘించి సుమారు రూ.2.1 కోట్లు సమీకరించినట్లు తెలిపింది. సోనుసూద్, అతడి సహచరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ చెప్పింది.
ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశ్ కా మెంటార్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడరుగా పనిచేస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించిన నేపథ్యంలో ఆదాయపుపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో నిరుపేదలకు సహాయపడేందుకు గత ఏడాది జులై నెలలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ రూ.20 కోట్లు విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన రూ.17 కోట్లు ఆ సంస్థ బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థతో సోను సూద్‌కు ఉన్న ప్రాపర్టీ డీల్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రాజకీయ కక్షతోనే సోను సూద్‌పై ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.