నటుడు సిద్ధార్థ్ మొబైల్ నెంబర్ లీక్.. చంపేస్తామంటూ బెదిరింపులు

Actor Siddharth receives death threats.సిద్ధార్థ్ ఫోన్ నెంబర్ లీక్ అయ్యింది.. దీంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 5:33 PM IST
Actor Siddharth

నటుడు సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే..! దేశంలో ఏవైనా ఘటనలు చోటు చేసుకున్నా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని చెబుతూ ఉంటాడు. గతంలో కూడా సిద్ధార్థ్ తన అభిప్రాయాన్ని ఏ మాత్రం దాచుకోకుండా బడా నాయకుల మీదనే తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సిద్ధార్థ్ పై పలు పార్టీలకు చెందిన నాయకులు, నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు.

భారతదేశంలో కరోనా విజృంభణకు కారణం భారతీయ జనతా పార్టీ అని సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఆరోపించారు. బీజేపీ నేతల మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే సిద్ధార్థ్ ఫోన్ నెంబర్ లీక్ అయ్యింది.. దీంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. బీజేపీ ఐటీ సెల్ ఈ పనికి పాల్పడిందని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. తనను బెదిరిస్తూ ఉన్నారని.. భయపడే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు.

''తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ నా మొబైల్‌ నంబర్‌ లీక్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్‌ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్‌ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు'' అని ట్వీట్ చేశారు సిద్ధార్థ్.

''తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్‌ నంబర్‌ని లీక్‌ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్‌ వైరల్ అయింది. వీరంతా నన్ను ట్రోల్‌ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా'' అని సిద్ధార్థ్‌ తెలిపారు . సిద్ధార్థ్ మరోవైపు తన ట్విట్టర్ ఖాతా ద్వారా కోవిడ్ సమయంలో సహాయం చేయాలని కోరుతూ ట్వీట్లు పెడుతూ ఉన్నారు.


Next Story