సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చిరంజీవి

Actor Sai Dharam Tej health updates.మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 2:25 AM GMT
సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. అపోలో ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని అపోలో ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. కాల‌ర్ బోన్ విర‌గింద‌ని తెలిపారు. శ‌రీరంలో అంత‌ర్గ‌త గాయాలు ఏమీ కాలేద‌న్నారు. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నామ‌ని.. మ‌రో 48 గంట‌ల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని చెప్పారు.

నిన్న రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై తీగ‌ల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెలుతుండ‌గా.. ఆయ‌న బైక్ స్కిడ్ అయి ప్ర‌మాదం జ‌రిగింది. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే 108తో పాటు పోలీసులకు స‌మాచారం అందించారు. ప్ర‌థ‌మ చికిత్స అనంత‌రం అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆయ‌న్ను పోలీసులు సాయిధ‌ర‌మ్ తేజ్‌గా గుర్తించి మాదాపూర్‌లోని మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. కుడి కన్ను పైన, ఛాతి, పొట్ట భాగంలో గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మాచారం అందుకున్న వెంట‌నే.. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిహారిక, సందీప్‌ కిషన్‌ హుటాహుటిన ఆస్పత్రికి వ‌చ్చారు. సాయిధరమ్‌ తేజ్‌ పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు.

తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి తెలియ‌జేశారు. తేజ్‌కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. త్వ‌ర‌గానే కోలుకుంటాడ‌ని అన్నారు. రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని ట్విట్ చేశారు.

Next Story
Share it