కపూర్ ఫ్యామిలీలో విషాదం.. రాజీవ్ కపూర్ కన్నుమూత
Actor Rajiv Kapoor passes away at 58.బాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత రాజ్‌కపూర్ తనయుడు రాజీవ్ కపూర్ ఇక లేరు.
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 3:36 PM ISTబాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. నటుడు రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్(58) ముంబైలో మృతి చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్ కపూర్ మంగళవారం తుదిశ్వాస విడిచారని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో రాజీవ్ కపూర్ ఫోటో షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.
దివంగత నటుడు రాజ్ కపూర్-కృష్ణ కపూర్‌లకు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్. ఇతనికి సోదరులు రణధీర్ కపూర్, రిషి కపూర్.. సోదరీమణులు రీతూ నంద, రీమా కపూర్ ఉన్నారు. రాజీవ్ కపూర్ 'రామ్ తేరి గంగా మెయిలీ' చిత్రంలోని నరేంద్ర పాత్రతో ఫేమస్ అయ్యారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. అనంతరం 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంలో నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్'కు దర్శకత్వం వహించారు. గతేడాది రిషీ కపూర్ క్యాన్సర్‌తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఏడాది గడవక ముందే తమ్ముడు రాజీవ్ కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి శోకసంద్రంలోకి నెట్టింది.
రాజీవ్ మృతిపట్ల అన్నయ్య రణధీర్ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ కపూర్ బాబాయిలైన షమ్మీ కపూర్, శశీ కపూర్‌లు కూడా బాలీవుడ్ లో రాణించారు. వీరి కుటుంబంలో నాల్గో తరంలో రిషీ కపూర్ తనయుడు రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ హీరోగా కొనసాగుతున్నాడు. రాజీవ్ కపూర్ మరణంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.