ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ కు విజయవాడ 14వ అదనపు జిల్లా ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. తన భార్య శ్రీలక్ష్మీకి ప్రతి నెల రూ.8లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది.
1984లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌తో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కాగా.. పృథ్వీరాజ్ విజయవాడలోని మా పుట్టింటిలోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించాడని, అందుకు అయిన ఖర్చులన్ని మా తల్లిదండ్రులే భరించారని, ఆయన నన్ను తరచూ వేధిస్తుండేవాడు. 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి గెంటివేయడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నాను. అని శ్రీలక్ష్మీ ఫిర్యాదులో పేర్కొంది.
తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న శ్రీలక్ష్మీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు రూ.8లక్షలు ఇవ్వాలని, కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇవ్వాలని ఆదేశించారు. ప్రతినెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని తీర్పును నిచ్చింది.