'మా' ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ లేఖ.. సీసీటీవీ పుటేజ్ కావాలి
Actor Prakash Raj writes letter to MAA Election officer.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వేడి ఇప్పట్లో
By తోట వంశీ కుమార్ Published on 14 Oct 2021 11:42 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వేడి ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎన్నికలు జరిగిన రోజున అనేక అరాచకాలు జరిగాయంటూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపించింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ ఓ లేఖ రాశారు. 'మా' ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ అందులో కోరారు.
Seeking justice… my letter to #Maaelections election officer #justasking pic.twitter.com/3P0ex1VOIf
— Prakash Raj (@prakashraaj) October 14, 2021
లేఖలో ఏం ఉందంటే.. 'ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గారికి.. 'మా' ఎన్నికల సందర్భంగా ఎన్నో భయంకర ఘటనలు జరిగాయి. అందుకు మీరే సాక్షి. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశా. కొందరు 'మా' సభ్యులను వారు దూషించడం, బెదిరించడం చేశారు. భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. 'మా' సభ్యులు నిజం ఏంటో, పోలింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు ఎన్నికల ముందు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను పెడతామని చెప్పారు. వాటిలో అన్ని రికార్డ్ అయి ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం మాకున్న ప్రజాస్వామిక హక్కుగా నేను భావిస్తున్నాను. ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులను కనీసం మూడునెలల పాటు భద్రపర్చడం మీ విధి. మీరు వెంటనే స్పందించకపోతే.. అది డిలీట్ అయ్యే అవకాశాలున్నాయి అని ఆ లేఖలో ప్రకాశ్ రాజ్ రాశారు.