రాళ్ల దాడి ఘటనపై మరింత తీవ్రంగా స్పందించిన పోసాని
Actor Posani Krishna Murali Respond On His House Attack.సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వర్సెస్ పవన్ కళ్యాణ్
By M.S.R Published on 30 Sept 2021 6:30 PM ISTసినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలోని పోసాని నివాసం పై రాత్రి 2 గంటల సమయంలో రాళ్లతో దాడి చేశారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. ఊహించని ఈ ఘటనతో వాచ్‌మెన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటనపై ఎస్ఆర్‌నగర్ పోలీసులకు వాచ్‌మెన్ ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో పోసాని గానీ, ఆయన కుటుంబ సభ్యులు అక్కడ లేనట్లుగా తెలుస్తోంది.
తన ఇంటిపై రాళ్ల దాడి ఘటనపై పోసాని తీవ్రంగా స్పందించారు. తాను డబ్బుల కోసమో, పదవుల కోసమో మాట్లాడనని అన్నారు. ఇలాంటి రాళ్ల దాడులు ఇంకెన్ని చేసినా తాను భయపడబోనని అన్నారు. తన ఇంటిపై రాళ్లు విసిరింది పవన్ కళ్యాణ్ అభిమానులేనని పోసాని ఆరోపించారు. పవన్ ఓ ఆవేశపరుడు. మొదటినుంచి సైకో బుద్ధి. ఆర్టిస్ట్ గా షూటింగుల్లోనూ పవన్ తీరు ఇంతేనన్నారు. పవన్ ది రెచ్చగొట్టే ధోరణి అని అన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా బట్టలిప్పి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు. ఇప్పుడు అతడి అభిమానులు కూడా నన్ను బట్టలిప్పి కొట్టాలంటున్నారు. నాకు తెలుగు రాష్ట్రాల్లోనూ, సినీ పరిశ్రమలోనూ ఇప్పటివరకు శత్రువులు లేరు. కానీ మొన్న సైకో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాను. అప్పటి నుండే ఇలా జరుగుతోంది. ఇలాంటి దాడులతో నన్ను ఆపలేరు, ఇలాంటి సన్నాసులను, చవటలను చాలామందిని చూశాను. నన్ను బట్టలిప్పి కొడితే నేను కూడా పవన్ కల్యాణ్ ను బట్టలిప్పి కొట్టగలను. నాకెవరూ అక్కర్లేదు.. నేనొక్కడినే వెళ్లి పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొడతా... మాగ్జిమమ్ చంపుతారు అంతేకదా అని ఆవేశంగా మాట్లాడారు.