నాగబాబు వ్యాఖ్యలు బాధించాయి : సీనియర్ నరేష్
Actor Naresh press meet.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధక్ష పీఠం కోసం
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2021 1:02 PM ISTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజు, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ బరిలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. తాజాగా 'మా' అధ్యక్షుడు సీనియర్ నరేశ్ మాట్లాడుతూ.. మా మసకబారిపోయింది అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాదించాయని అన్నారు. నాగబాబు తనకు మంచి మిత్రుడని, అతడితో కలిసి అనేకసార్లు కలిసి పనిచేశానన్నారు. మా చేపట్టిన అన్ని అభివృద్ది కార్యక్రమాల గురించి సినీ పెద్దలందరికీ ఎప్పడికప్పుడు సమాచారం అందించామన్నారు.
శుక్రవారం ప్రెస్ మీట్‌లో'మా'పై ప్రకాశ్ రాజ్, నాగబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో 'మా' కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.'నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడమే అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. నరేశ్ అంటే ఏంటని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా వాడిని. 'మా' బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంది. ప్రకాశ్‌రాజ్ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్ చేసి ఈ ఏడాది ఎలక్షన్‌లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ వేలాది మందికి అన్నం పెడుతున్నారు. ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మా రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, కృష్ణంరాజు వంటి ఎంతో మంది సినీ పెద్దలు.. మెట్టు మెట్టు పేర్చీ దీనిని స్థాపించారు. ఇప్పటి వరకూ ఉన్న అధ్యక్షులందరూ మా అభివృద్ది కోసమే ఎంతో కష్టపడి పనిచేశారన్నారు.
ఇప్పటికీ 'మా' ఎలక్షన్స్ ఏకగ్రీవంగా జరగాలి అని కోరుకుంటున్నానని చెప్పారు. మాలో 930 మందికి మెడికల్ ఇన్సూరెన్స్ చేసి.. వెయ్యి రూపాయలు వున్న పెన్షన్ ఆరు వేలు చేశామన్నారు. కరోనా టైంలో 'మా'లో 87 మంది కొత్త సభ్యులు చేరగా కళ్యాణ లక్ష్మి, ఫించన్లు, ఆరోగ్యం కోసం ఇలా చాలా చాలా కార్యక్రమాలు చేశామన్నారు. ఇప్పటికీ మా క్రమశిక్షణ సంఘం రిజైన్ చెయ్యమంటే మేము అందుకు సిద్ధంగా ఉన్నామని నరేష్ చెప్పారు.