మోహన్‌బాబు ప్రశ్నలకు నాగబాబు కౌంటర్
Actor Nagababu slams Mohanbabu.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో 'మా' అసోసియేషన్ భవనంపై
By తోట వంశీ కుమార్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో 'మా' అసోసియేషన్ భవనంపై వివాదం ముదురుతోంది. గతంలో మా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని తక్కువ ధరకు అమ్మేశారంటూ ఇటీవల మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మరో నటుడు నాగబాబు చురకలు అంటించారు.
మోహన్ బాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ మండిపడ్డారు నాగబాబు. 2006 నుంచి 2008 మధ్య తాను అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలోనే బిల్డింగ్‌ను కొనుగోలు చేశామని చెప్పారు. చాంబర్ వాళ్లు మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చేవారు. అలా అప్పుడు కొత్త బిల్డింగ్ కొనాల్సి వచ్చిందన్నారు. భవనాన్ని రూ.71.73లక్షలతో కొనుగోలు చేశామని.. ఇంటిరీయర్ డిజైన్ కోసం మరో రూ.3లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2008లో అధ్యక్ష పీఠం దిగిన తరువాత నుంచి 'మా' వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని, 'మా' అభివృద్దికి కావాల్సిన సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చానని తెలిపారు.
ఆ భవనం అమ్మక వ్యవహరమంతా నరేశ్-శివాజీ రాజాలకే తెలుసని చెప్పారు. శివాజీరాజా అధ్యక్షుడిగా నరేశ్ కార్యదర్శిగా ఉన్నప్పుడే ఆ భవనాన్ని బేరానికి పెట్టి రూ.30లక్షలకే అమ్మేశారన్నారు. అంత తక్కువ ధరకు భవనాన్ని ఎందుకు అమ్మేశారు అనే విషయాన్నిగురించి నరేశ్‌ని అడగాలని మోహన్ బాబుకు సూచించారు. తాను కూడా అదే విషయంపై నరేశ్‌ను ప్రశ్నిస్తానని చెప్పారు. బిల్డింగ్ అమ్మకం గురించి మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తానని నాగబాబు హెచ్చరించారు.