సినీ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. తన సోదరుడు రమేష్‌బాబు ఆకస్మిక మరణం పట్ల హీరో మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. అన్నయ్యను కడసారి చూసుకునే బాగ్యానికి మహేష్ నోచుకోలేదు. మహేష్‌బాబుకు కరోనా నిర్థారణ కావడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉండిపోయారు. అందుకనే రమేష్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్. 'మళ్లీ జన్మ ఏదైనా ఉంటే అందులోనూ నువ్వే నా అన్నయ్య' అంటూ తన బాధను వ్యక్త పరిచారు.
'నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వే నా బలం, నువ్వు నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు. నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికీ ధన్యవాదాలు. ఈ జన్మలోనే కాదు వేరే జన్మ ఏదైనా ఉంటే అందులోనూ నువ్వే నా అన్నయ్యగా ఉండాలని కోరుకుంటా. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.' అంటూ మహేష్ బావోద్వేగపు ట్వీట్ చేశారు.
రమేష్‌బాబు గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన మార్గమధ్యంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.