పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహం.. కడసారి చూసేందుకు బారులు తీరిన జ‌నం

Actor Krishna Dead Body shited to Padmalaya Studio.కృష్ణ అంత్య‌క్రియ‌లు బుధ‌వారం మ‌హాప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2022 9:46 AM IST
పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహం.. కడసారి చూసేందుకు బారులు తీరిన జ‌నం

సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు బుధ‌వారం హైద‌రాబాద్‌లోని మ‌హాప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో కృష్ణ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శికి సూచించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల త‌రువాత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.

అభిమానుల సంద‌ర్శ‌నార్థం కృష్ణ పార్థివదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసం నుంచి ప‌ద్మాల‌య స్టూడియోకి తీసుకువ‌చ్చారు. మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల వ‌ర‌కు అక్క‌డే ఉంచ‌నున్నారు. త‌మ అభిమాన న‌టుడిని క‌డ‌సారి చూసుకునేందుకు భారీగా అభిమానులు త‌ర‌లివ‌స్తున్నారు. కృష్ణ భౌతిక కాయాన్ని చూసి అభిమానులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

కృష్ణ భౌతిక కాయానికి నివాళుల‌ర్పించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బుధ‌వారం హైద‌రాబాద్‌కు రానున్నారు. ఉద‌యం 11.20 గంట‌ల‌కు ప‌ద్మాల‌య స్టూడియోస్‌కు జ‌గ‌న్ చేరుకుంటారు.

లవ్‌ యూ నాన్న.. మంజుల ఎమోషనల్ పోస్ట్

కృష్ణ మృతి పట్ల ఆయన కుమార్తె మంజుల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాన్నను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు ." నాన్నా మీరే నా జీవితానికి సూపర్ ‍స్టార్. చిత్ర సీమకు మీరు చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. లవ్‌ యూ నాన్న "అని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

సోమవారం ఉదయం కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో కుటుంబసభ్యులు కృష్ణను కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఆయ‌న క‌న్నుమూశారు.

Next Story