క్యాన్సర్‌తో హాలీవుడ్ నటి కిర్‌స్టీ అల్లీ కన్నుమూత
Actor Kirstie Alley passes away at 71 following battle with cancer.హాలీవుడ్ నటి కిర్‌స్టీ అల్లీ కన్నుమూసింది.
By తోట వంశీ కుమార్ Published on 6 Dec 2022 10:37 AM ISTహాలీవుడ్ నటి కిర్‌స్టీ అల్లీ కన్నుమూసింది. గత కొంతకాలంగా ఆమె కాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచింది. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. కిర్‌స్టీ అల్లీ ఇక లేరు అనే వార్తను ఆమె కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్, కుమార్తె లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మా అమ్మకు క్యాన్సర్ ఉన్నట్లు ఇటీవలే గుర్తించాం. దానితో పోరాడుతూ ఆమె మరణించింది. అని వారు తెలిపారు.
" ఆమె ఇన్నాళ్లు ఎంతో గొప్పగా పోరాడింది. ఆమె జీవితంలో అంతులేని ఆనందం, ముందుకు సాగే సాహసాలను మాకు వదిలేసి వెళ్లిపోయింది. మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని వైద్యులు, నర్సుల బృందం అద్భుతమైన చికిత్స అందించారు. వారి సంరక్షణకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము." అని ట్రూ స్టీవెన్సన్, లిల్లీ ప్రైస్ స్టీవెన్సన్ లు ఓ ప్రకటనలో తెలిపారు.
1970లో బాబ్ అలీ అనే వ్యక్తిని కిర్‌స్టీ అల్లీ పెళ్లి చేసుకుంది. అయితే.. 1977లో వీరిద్దరు విడిపోయారు. తరువాత పార్కర్ స్టీవెన్‌సన్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 1987 నుంచి 1993 వరకు ఎన్బీసీ సిట్‌కామ్ ''చీర్స్''లో రెబెక్కా హోవే పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కిర్‌స్టీ అల్లీ. ఈ పాత్రకు గాను 1991లో ఎమ్మీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందుకున్నారు.
డ్రాప్ డెడ్ గార్జియస్, వెరోనికాస్ క్లోసెట్, ఇట్ టేక్స్ టూ, సిబ్లింగ్ రివాల్రీ, షూట్ టు కిల్, లవర్‌బాయ్, రన్అవే వంటి చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు. అంతేకాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్వవహరించారు.
ఆమె మరణం పట్ల ఆమె సహనటుడు జాన్ ట్రావోల్టా విచారం వ్యక్తం చేశారు. కిర్‌స్టీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అని తెలిపాడు. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను కిర్‌స్టీ. మనం మళ్ళీ ఒకరినొకరు చూస్తామని నాకు తెలుసు." అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.