చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నటి అకాల మరణం
Actor Hamsavirdan’s wife Shanthi Hamsavirtan passed away.ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు
By తోట వంశీ కుమార్ Published on 23 Jun 2021 3:52 AM GMT
ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడ్డారు. వీరి అకాల మరణాల నుంచి ఇంకా తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. నటి రేష్మా అలియాస్ శాంతి సోమవారం సాయంత్రం మరణించారు. ఆమె వయస్సు 42 సంవత్సరాలు. శ్వాస సంబంధిత సమస్యతో మృత్యువాతపడ్డారు.
ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్ అని, ఆ తరువాత నెగెటివ్ అనే భిన్న ఫలితాలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో ఆమె సోమవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. కార్తీక్ హీరోగా తెరకెక్కిన 'కిళక్కు ముగం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది రేష్మా. పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. సీనియర్ నటుడు రవిచంద్రన్ కుమారుడు హర్షవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకుంది. వీరికిద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.