హీరోయిన్ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, ఆమె రౌడీ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరో ఇద్దరిపై హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ ధాన్' సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకున్నారని పేర్కొన్నారు. 'వండర్ బార్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ధనుష్ 'నానుమ్ రౌడీ ధాన్' సినిమాను నిర్మించారు. ఇటీవల ఈ విషయమై నయనతార, ధనుష్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ డ్రామాలో 'నానుమ్ రౌడీ ధాన్' విజువల్స్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ సివిల్ దావా వేశాడు. అంతకుముందు హీరో ధనుష్ తనకు రూ.10 కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై నయనతార మండిపడ్డారు. ''మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన 'నానుమ్ రౌడీ ధాన్' క్లిప్స్ వాడుకునేందుకు ఎన్‌వోసీ అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.