జైలులో గ్యాంగ్‌స్టర్‌తో క‌లిసి దర్శన్ రాజభోగాలు..!

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ జె.నాగరాజ్ అలియాస్ విల్సన్ గార్డెన్ నాగతో కలిసి సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది

By Medi Samrat  Published on  26 Aug 2024 5:00 PM IST
జైలులో గ్యాంగ్‌స్టర్‌తో క‌లిసి దర్శన్ రాజభోగాలు..!

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న హీరో దర్శన్, గ్యాంగ్‌స్టర్ జె.నాగరాజ్ అలియాస్ విల్సన్ గార్డెన్ నాగతో కలిసి సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఫోటో ఎప్పుడు తీశారు అనే సమాచారం లేనప్పటికీ.. కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి ఈ విజువల్స్. వైరల్ ఫోటోలో దర్శన్, విల్సన్ గార్డెన్ నాగ, ఇతరులు జైలు లాన్‌పై కూర్చుని, చేతిలో కప్పు పట్టుకుని సిగరెట్ తాగుతున్నట్లు చూడొచ్చు. మరో వీడియోలో దర్శన్ తూగుదీప వీడియో కాల్ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్‌తో పాటు మరో 11 మందిని జూన్‌లో అరెస్టు చేశారు. అయితే జైలులో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. దర్శన్‌కు మొబైల్‌ ఫోన్లు, జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించినందుకు గాను ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. నటుడికి ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ గురించి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో దర్శన్, అతని సహ నిందితులను ఇతర జైళ్లకు తరలించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.

రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్రగౌడ్ సహా 17 మందిని అరెస్ట్ చేశారు. దర్శన్ అభిమాని, 33 ఏళ్ల ఆటో డ్రైవర్ రేణుకస్వామి జూన్ 9న బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ దగ్గర శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రేణుకస్వామిని దర్శన్ సూచనల మేరకు ఓ ముఠా కిడ్నాప్ చేసి హత్య చేసింది.

Next Story