ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గ‌ణేశ్ షాక్‌.. ప్యానెల్ నుంచి ఔట్‌.. వ‌రుస ట్వీట్లు

Actor Bandla Ganesh came out from Prakash Raj Panel.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత ఉత్కంఠకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Sep 2021 8:31 AM GMT
ప్రకాశ్‌రాజ్‌కు బండ్ల గ‌ణేశ్ షాక్‌.. ప్యానెల్ నుంచి ఔట్‌.. వ‌రుస ట్వీట్లు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. తాజాగా సినీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ అంద‌రికి షాక్ ఇచ్చాడు. ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ట్వీట్ చేశాడు. అంతేకాదు తాను జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పోటి చేయాల‌నుకుంటున్న‌ట్లు తెలిపాడు. మా ఎన్నిక‌ల‌పై బండ్ల వ‌రుస‌గా ట్వీట్లు చేస్తున్నారు.

గౌర‌వ‌నీయులైన ప్ర‌కాశ్‌రాజ్ గారూ.. మీ ప్యానెల్ లో స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చినందుకు మీకు ధ‌న్య‌వాదాలు. కానీ.. నా వ్యక్తిగత పనుల వల్ల దీనికి నేను న్యాయం చేయలేనేమోననిపిస్తోంది. దయచేసి ఈ పోస్టుకు వేరేవాళ్లను సెలెక్ట్ చేసుకోండి. మీ టీమ్ కు ఆల్ ద బెస్ట్ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

మ‌రో ట్వీట్‌లో.. 'మాట తప్పను.. మడమ తిప్పను. నాది ఒకటే మాట -ఒకటే బాట. నమ్మినవారి కోసం బతుకుతా. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను. నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను. పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను' అని బండ్ల మ‌రో ట్వీట్‌లో వెల్ల‌డించారు.

'మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటి. అంద‌రికి ఒక అవ‌కాశం ఇచ్చారు. ఒకే ఒక అవ‌కాశం నాకు ఇవ్వండి నేనేంటో చేపిస్తా'..

'నా పరిపాలన ఎంటో తెలియచేస్తా. వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం. దానికోసం పోరాడతా. వారి సొంత ఇంటి కల నిజం చేస్తా. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటే 'మా' సభ్యులు నమ్మరు'.

'గొడవలతో 'మా' సభ్యులను మోసం చేసింది చాలు. ఇక అలా జరగొద్దు. అందరి ఆశీస్సులు కావాలి. 'మా'ను బలోపేతం చేద్దాం.. ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దాం. అదే మా నిజమైన అభివృద్ధికి చిహ్నం' అని బండ్ల గ‌ణేష్ వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం బండ్ల ట్వీట్ల‌పై టాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

Next Story