నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని నందమూరి అభిమానులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అదిగో అప్పడు వస్తాడు, కాదు ఇప్పుడు వస్తాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై స్పందించని బాలయ్య.. ఎట్టకేలకు పెదవి విప్పాడు. మోక్షజ్క్ష సినీ రంగ ప్రవేశంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. తన తనయుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పేశారు.
గోవాలో నిర్వహిస్తున్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'అఖండ' చిత్రాన్ని ప్రదర్శించగా బాలయ్య, బోయపాటి శ్రీను సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను లాంచ్ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై కూడా బాలయ్య స్పందించారు." అంతా దైవేచ్ఛ" అని నవ్వి ఊరుకున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీపై ఖాయం అవ్వడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే మోక్షజ్ఞ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తాడా..? లేక మరో దర్శకుడితో వస్తాడా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఇదిలాఉంటే.. బాలయ్య మరో శుభవార్త కూడా చెప్పేశాడు. "అఖండ 2" మూవీ తప్పకుండా ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే సబ్జెక్టు కూడా సిద్ధం చేశామని, ప్రకటించడం ఒక్కటే మిగిలి ఉందని అన్నాడు. మంచి సమయం చూసి ప్రకటించనున్నట్లు తెలిపాడు.