తాతినేని రామారావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
Actor Balakrishna Deep Condolence to Tatineni Ramarao.అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు నేడు(బుధవారం)
By తోట వంశీ కుమార్
అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు నేడు(బుధవారం) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. తాతినేని రామారావు మరణం పట్ల హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.
'దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకులు తాతినేని రామారావు ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయనొక అద్భుతమైన దర్శకులు. నాన్నతో కలిసి చరిత్రలో నిలిచిపోయే యమగోల లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను హీరోగా చేసిన తల్లిదండ్రులు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు డబ్బులు మిగలాలని ఆలోచిస్తూ.. అదే సమయంలో చిత్ర నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు సొంతం. బాలీవుడ్‌లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని బాలకృష్ణ ఆ ప్రకటనలో తెలిపారు.