డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ అరెస్ట్ అయ్యాడు. శనివారం ఆయన ఇంట్లో ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో స్వల్ప మొత్తంలో కొకైన్ లభ్యమైంది. కోహ్లీని ప్రశ్నించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసుకు అంతర్జాతీయ సంబంధాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా..ఈ కొకైన్ ముంబైకి ఎలా వచ్చింది. దీనిలో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
నిన్న డ్రగ్స్ సరఫరదారుడు అజయ్ రాజు సింగ్ ఎన్‌సీబీ అధికారులకు చిక్కడంతో అతడిని పోలీసులు విచారించారు. లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడులు చేశారు. కొకైన్ లభించడంతో ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్‌పాయో చిత్రంలో అర్మాన్ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ బిగ్ బాస్‌లోనూ అర్మాన్ కోహ్లీ పాల్గొన్నాడు.