ఆస్పత్రిలో అబ్బాస్.. ఆందోళనలో అభిమానులు..!
Actor Abbas was admitted to the hospital.అబ్బాస్ అని పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు.
By తోట వంశీ కుమార్
అబ్బాస్ అని పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు గానీ 'ప్రేమ దేశం' హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. 1996లో కదీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. ఆ చిత్రంలోని 'ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా' పాట ఇప్పటికీ వినపడుతూనే ఉంది. తాజాగా ఈ హీరో ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అతడికి ఏమైంది..? ఎందుకు ఆస్పత్రిలో ఉన్నాడు అని కంగారు పడిపోతున్నారు అతడి అభిమానులు. దీనిపై అబ్బాయి స్పందించాడు. తనకి సర్జరీ జరిగిందని చెప్పాడు. "ఆస్పత్రిలో ఉన్న ఈ సమయంలో నా మనసు అంతా గందరగోళంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. ఆపరేషన్ తరువాత కొంత ఉపశమనం లభించింది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అంటూ ఫేస్‌బుక్‌లో అబ్బాస్ రాసుకొచ్చాడు. తాను ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అయితే.. ఎందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడో చెప్పలేదు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.
'ప్రేమ దేశం' చిత్రం తరువాత అబ్బాస్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస చిత్రాల్లో నటించారు. అయితే.. ఆశించిన మేర అభిమానులను అలరించలేకపోయారు. 2015లో సినిమాకు విరామం ప్రకటించి తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.