ఏ1 ఎక్స్ ప్రెస్ రివ్యూ

A1 express movie review and rating. సందీప్ కిషన్ 25వ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ రివ్యూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 March 2021 9:24 AM GMT
A1 express movie review and rating
తెలుగు చిత్ర పరిశ్రమలో స్పోర్ట్స్ డ్రామాలు రావడం చాలా తక్కువే.. అలాంటిది తమిళంలో హిట్ అయిన 'నాట్పే తునాయ్' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని.. అది కూడా తన 25వ సినిమాగా చేయాలని హీరో సందీప్ కిషన్ అనుకున్నాడు. తన సొంత బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించాడు. ట్రైలర్ కు, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళి శర్మ కీలక పాత్రల్లో కనిపించారు.

కథ:

సినిమా యానాంలో మొదలవుతుంది. యానాంలోని చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌ అంటే ఆ ప్రాంతం వాళ్లకు ఎంతో ఇష్టం. అద్భుతమైన చరిత్ర ఉన్న ఆ చిట్టి బాబు హాకీ గ్రౌండ్ లో కోచ్‌ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటారు. ఆయన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు నేషనల్స్ కు కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఇక ఆ గ్రౌండ్ ఉన్న ప్రాంతాన్ని చూసి ఓ బడా కంపెనీ మెడికల్‌ ల్యాబ్‌ని కట్టాలనుకుంటుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్‌(రావు రమేశ్‌) తో డీల్ కుదుర్చుకుంటారు. ఇక ఆ గ్రౌండ్ ను సొంతం చేసుకుకోడానికి తనదైన విలనిజం చూపిస్తూ రావు రమేశ్ ఆ క్లబ్ ఆటగాళ్లను తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బంధువుల ఇంటికి యానాంకు వచ్చిన సంజు(సందీప్ కిషన్).. అదే క్లబ్ లో విమెన్స్ టీమ్ కు ఆడే లావణ్య(లావణ్య త్రిపాఠి) తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆమె వెనకాల తిరగాలి అని చెప్పి ఆ గ్రౌండ్ లో ఎంట్రీ అందుకుంటాడు. ఒకానొక దశలో లావణ్యకు ఆటలో అన్యాయం జరుగుతోందని భావించి సందీప్ సహాయం చేయడానికి తనలో ఉన్న ట్యాలెంట్ ను చూపిస్తాడు..! అసలు ఆట అంటే ఏమిటో తెలియదేమో అని అందరూ భావించే సమయంలో సందీప్ గేమ్ ను చూసి అందరూ షాక్ అవుతారు.. ఇక సందీప్ ఎవరు..? అతడికి హాకీతో సంబంధం ఏమిటి..? చిట్టిబాబు గ్రౌండ్ ను కాపాడడానికి సందీప్ ఎలాంటి సహాయం చేస్తాడు..? ఆ గ్రౌండ్ ను కాపాడుకున్నారా లేదా..? అన్నది కథ..!

నటీనటులు :

హాకీ ప్లేయర్ అంటే మంచి ఫిజిక్ ఉండాలి.. ఈ సినిమా కోసం అచ్చం స్పోర్ట్స్ పర్సన్ లా సందీప్ కిషన్ తయారయ్యాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు. సందీప్‌ కిషన్‌ పడ్డ కష్టం కనిపిస్తుంది. హాకీ క్రీడాకారిణిగా, సందీప్ లవర్ గా లావణ్య‌ త్రిపాఠి పర్లేదు. మురళీ శర్మ హాకీ కోచ్ గా కనిపించాడు. కొన్ని కొన్ని సీన్లలో తాను ఎందుకు అంత వెర్సటైల్ యాక్టర్ అయ్యారో నిరూపించుకున్నారు. క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్‌ హైలైట్. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ మన సమాజం గురించే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో ఒక ఉదాహరణగా ఇకపై ఈ సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ ను చూపించొచ్చు. రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, సత్య, మహేశ్‌ విట్టా, పొసాని కృష్ణమురళి, రఘు బాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ:

సినిమా హాకీ మీద వెళుతుంది. కానీ హాకీ గురించి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసేమో అన్నట్లుగా కథ ముందుకు వెళ్ళిపోతుంది. ఎంతగా అంటే సినిమా క్లైమాక్స్ దాకా కూడా హాకీ ఎంతసేపు ఆడతారు అన్నది సగటు ప్రేక్షకుడికి తెలియదు. ఒక స్థలం.. ఆ స్థలాన్ని కాపాడుకోడానికి ఓ టీమ్ పడే తపన ఇలాంటి కథలను చూసే ఉంటాం.. 'సై' సినిమా కూడా అలాంటిదే.. కానీ అక్కడ ఎమోషన్ క్యారీ అయింది. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ పాళ్లు చాలా వరకూ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగానూ... ఇంటర్వెల్ వరకూ ఎక్స్ ప్రెస్ లాగా సాగిపోతుంది సినిమా..! ఇంటర్వెల్ లో హీరో గురించి తెలిపే సన్నివేశం వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాతనే కథ తెలిసిపోవడం.. ఇక క్లైమాక్స్ లో ఎలాగూ జరిగేది ఇదే కదా అన్నది సినిమాను నీరుగారుస్తాయి. ఒకానొక దశలో ఎక్స్ ప్రెస్ లా సాగే సినిమా.. చాలా ఆర్డినరీగా మారిపోతుంది.

ఆఖరి 20 నిమిషాలు హాకీ మ్యాచ్ లాగా అనిపించినా ఆ మ్యాచ్ కు ఇచ్చే కామెంట్రీ కాస్తా సీన్లు పండకుండా చేస్తుంది. హిప్‌ హాప్‌ తమిళ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హీరో ఎలివేషన్ షాట్స్ కు బాగా ప్లస్ అయింది. సింగిల్ కింగులం పాట మినహాయిస్తే మిగతా పాటలు పెద్దగా హిట్ కూడా అవ్వలేదు.. గుర్తుండవు కూడానూ..! కెవిన్ రాజ్‌ సినిమటోగ్రఫి, చోటా కె. ప్ర‌సాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. కొన్ని అనవసరమైన సీన్స్ ను తీసి వేసి ఉండి ఉంటే.. సినిమాకు ఇంకాస్త ప్లస్ అయ్యేవే..! స్పోర్ట్స్ లో ఉండే లోకల్ పాలిటిక్స్ ను చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైపోవడం.. ఇంకొన్ని చోట్ల ప్రేక్షకులపై ఇంపాక్ట్ పడకుండా పోవడంతో సినిమా కాస్తా ఆర్డినరీగా అనిపిస్తుంది.

రేటింగ్: 2.5/5


Next Story