హిందీ బిగ్ బాస్-17లో హైదరాబాదీ యూట్యూబర్.. టైటిల్ నెగ్గేనా..?
బిగ్ బాస్ సీజన్ 17 కోసం వెయిటింగ్ ఎట్టకేలకు ముగిసింది. రియాలిటీ షో మరోసారి టెలివిజన్ స్క్రీన్‌ల ముందుకు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2023 8:54 PM ISTబిగ్ బాస్ సీజన్ 17 కోసం వెయిటింగ్ ఎట్టకేలకు ముగిసింది. రియాలిటీ షో మరోసారి టెలివిజన్ స్క్రీన్‌ల ముందుకు రావడంతో ఈ సీజన్ లో ఎవరెవరు వస్తారా అని ఆసక్తి మొదలైంది. అయితే ఒక యూట్యూబర్ కు బిగ్ బాస్ 17 లో అవకాశం దక్కడం విశేషం. అరుణ్ శ్రీకాంత్ మశెట్టి, 288,000 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ 17 లో భాగమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి బిగ్ బాస్ వేదికపైకి రావడం ఇదే మొదటిసారి కావడంతో హిందీ బిగ్ బాస్ ను ఫాలో అయ్యే తెలుగు అభిమానుల మోముల్లో ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో 598,000 కంటే ఎక్కువ మంది ఫాలోయింగ్‌తో 27 ఏళ్ల అరుణ్ శ్రీకాంత్ మశెట్టి బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాడు. భార్య, కుమార్తె.. అరుణ్ విన్నర్ గా నిలవాలని కోరుకుంటూ ఉన్నారు. బిగ్ బాస్ 17 ప్రారంభమైన సమయంలోనే వివాదాలలో భాగమైంది. అరుణ్ మొదటి రోజు నుండే షోలో వివాదాలలో చిక్కుకున్నాడు. అరుణ్.. ఐశ్వర్య శర్మ, నీల్ భట్, అంకితా లోఖండే, విక్కీ జైన్, మునావర్ ఫరూకీ, మన్నారా చోప్రా, UK07 రైడర్, సన్నీ ఆర్య, సోనియా బన్సాల్, ఫిరోజా ఖాన్‌లతో సహా అనేక మంది ప్రముఖులతో పోటీ పడబోతున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడుతారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అరుణ్ శ్రీకాంత్ బిగ్ బాస్ 17 హౌస్‌లోకి రింకు ధావన్‌తో కలిసి ప్రవేశించాడు.
అరుణ్ శ్రీకాంత్ మశెట్టి ప్రఖ్యాత డిజిటల్ కంటెంట్ సృష్టికర్త. గేమర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోయింగ్‌తో.. అరుణ్ బిగ్ బాస్ 17 స్టాండ్‌అవుట్ స్టార్‌లలో ఒకరిగా నిలిచాడు. తోటి పోటీదారులతో ముఖ్యంగా ఐశ్వర్య శర్మ, నీల్ భట్‌లకు సంబంధించి ఆన్-స్క్రీన్ లో జరిగిన వాదోపవాదాలు బిగ్ బాస్ హౌస్‌లో మంచి కంటెంట్ ను ఇచ్చాయి. శ్రీకాంత్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా బాలీవుడ్ స్టార్స్ కు అడ్డుగా నిలుస్తూ ఉండడంతో.. అతడి గెలుపు కోసం పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు.