ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ అంటూ భారీ మోసం..!

A gang cheats aspirant actors on the name of prabhas. ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ అంటూ భారీ మోసానికి పాల్పడింది ఓ ముఠ.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jan 2021 3:28 PM IST
Prabhas

సినీ ఇండ‌స్ట్రీలో మోసాలు జ‌రుగుతూనే ఉన్నాయి. వెండి తెర‌పై క‌నిపించాల‌నే తాప‌త్ర‌యంతో మోస‌గాళ్ల చేతుల్లో ప‌డిపోతున్నారు. ఇక మోస‌గాళ్లు కూడా ఫ‌ల‌నా హీరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాం అని చెప్పి అమాయ‌కుల‌ను నుంచి అందిన‌కాడికి స్వాహా చేస్తున్నారు. తాజాగా విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ అని చెప్పి.. పెద్ద ఎత్తున మోసానికి పాల్ప‌డిందో ముఠా.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించేందుకు సువర్ణ అవకాశమని, ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోండి అంటూ ఓ ముఠా ఔత్సాహికులను మోసం చేసింది. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలో అవకాశాలు ఉన్నాయని ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రకటన విడుదల చేశారు. అవకాశం ద‌క్కాలంటే.. ముందుగా కొంత రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించాల‌ని వారు సూచించారు. అది న‌మ్మిన కొంద‌రు రిజిస్ట్రేష‌న్ కోసం కొంత డ‌బ్బుల‌ను చెల్లించారు. కొన్ని రోజుల్లో మా కంపెనీ నుంచి మీకు మెసేజ్ వ‌స్తుంద‌ని.. న‌టించ‌డానికి సిద్దంగా ఉండాల‌ని ప్రొడ‌క్ష‌న్ సంస్థ చెప్పింద‌ట‌.

దాంతో న‌మోదు చేసుకున్న వారు.. తాము ప్ర‌భాస్ చిత్రంలో న‌టించ‌బోతున్నాం అని ఎంతో ఆనంద‌ప‌డ్డార‌ట వారు. అయితే.. చాలా రోజులు గ‌డిచిన‌ప్ప‌టికి స‌ద‌రు సంస్థ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేద‌ట‌. దాంతో ఆ ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లి ఆరా తీయగా తాము మోసపోయామని తెలిసిందట. వెంట‌నే వారంతా పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా.. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ మోసం ముంబై కేంద్రంగా న‌డిచింది. బాధితుల ఒక్కొక్క‌రి నుంచి రూ.5వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు వసూలు చేసినట్లు సమాచారం.


Next Story