సోనుసూద్‌ను కొడుతున్నారని.. టీవీ పగలగొట్టిన ఏడేళ్ల చిన్నారి
7 years old boy broke TV in Sangareddy dist.సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికి నిజజీవితంలో హీరో
By తోట వంశీ కుమార్ Published on 14 July 2021 4:22 AM GMTసినిమాల్లో విలన్‌గా నటించినప్పటికి నిజజీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో నేనున్నాన్నంటూ ముందుకు వచ్చాడు. కరోనా తొలి వేవ్ సమయంలో లాక్‌డౌన్ వల్ల సొంతూళ్లకు వెళ్లలేకపోయిన ఎంతో మందికి వారి స్వస్థలాలకు పంపించడంతో మొదలైన సోనూ సేవలు నేటికి కొనసాగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతుండడాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఈ నటుడు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు. అడిగిన వారికి లేదనకుండా తన వంతు సాయాన్ని చేస్తున్నాడు. దీంతో సోనును అభిమానించే వారి సంఖ్య చాలా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే.. సోనుకి గుడి కూడా కట్టారంటే ఎంతలా అభిమానిస్తున్నారో అర్థం చేస్తుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. ఓ ఏడేళ్ల బాలుడు సినిమాలో సోనును కొడుతుంటే తట్టుకోలేకపోయిన ఆ బాలుడు టీవీని పగలకొట్టాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూరునగర్ మండలం వేపలసింగారానికి చెందిన గురవయ్య. పుష్పలత తమ కుమారుడు విరాట్‌తో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామానికి వెళ్లారు. అక్కడ బంధువులతో కలిసి టీవీ చూస్తున్నారు.
టీవీలో ఓ సినిమా వస్తోంది. అందులో విలన్‌గా సోనుసూద్ నటించాడు. ఆ చిత్రంలోని హీరో.. విలన్ అయిన సోనుసూద్‌ని కొడుతున్నాడు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన విరాట్.. చేతికి అందిన రాయి విసరడంతో టీవీ పగిలిపోయింది. ఒక్క క్షణం కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. తేరుకున్న అనంతరం విరాట్‌ని టీవీ ఎందుకు పగలకొట్టావు అని ప్రశ్నించగా.. సోనుసూద్‌ను కొట్టినందుకు తనకు కోపం వచ్చిందని.. అందుకనే అలా చేశానని విరాట్ చెప్పుకొచ్చాడు. దీంతో వారంతా ఆశ్చర్యానికి లోనైయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం కాస్త..సోనుసూద్‌కి తెలిసింది.
దీనిపై సోను సరదాగా కామెంట్ చేశాడు. అయ్యో.. మీ టీవీలను ఎవరూ పగలగొట్టకండి. అతడి తండ్రి ఇప్పుడు కొత్త టీవీ కొనమని నన్ను అడగబోతున్నాడు అంటూ ట్వీట్ చేశాడు.