2023 ఫస్టాప్ : భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ్డ సినిమాలివే..!

2023 Half Yearly Report Big Flops At Tollywood Box Office. 2023 సంవ‌త్స‌రం తొలి ఆరుమాసాల్లో టాలీవుడ్ లో చాలా సినిమాలు విడుద‌ల‌య్యాయి.

By Medi Samrat  Published on  3 July 2023 9:31 AM GMT
2023 ఫస్టాప్ : భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డ్డ సినిమాలివే..!

2023 సంవ‌త్స‌రం తొలి ఆరుమాసాల్లో టాలీవుడ్ లో చాలా సినిమాలు విడుద‌ల‌య్యాయి. ప‌దుల సంఖ్య‌లో విజయం సాధించగా, అంత‌కు ప‌దిరెట్లు పరాజయాలు కూడా నమోదయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా ప‌డ్డాయి. అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమై.. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ భారీ డిజాస్టర్లుగా మారిన తెలుగు సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం.

శాకుంతలం : భారీ ప‌ర‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న సినిమాల జాబితాలో మొదటిది "శాకుంతలం." ఈ చిత్రం కాళిదాసు "అభిజ్ఞాన శాకుంతలం" ఆధారంగా తెర‌కెక్క‌డం.. సమంత ప్రధాన పాత్రను పోషించడంతో అంచనాలు పెరిగాయి. భారీ బ‌డ్జెట్‌తో గుణ శేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. సీజీ వర్క్, టీవీ-సీరియల్ లాంటి డైలాగ్‌లు సినిమాను నాశనం చేశాయి. ఫలితంగా ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది.

కస్టడీ: న‌ఆగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌గా.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేక‌పోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'కస్టడీ' చిత్రం విడుదలకు ముందు దాదాపు 25 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. విడుద‌ల త‌ర్వాత క‌లెక్ష‌న్స్ సాధించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంది. అస‌లే థ్యాంక్స్ సినిమాతో ప్లాప్‌లో ఉన్న చైత‌న్య‌కు మ‌రో ప్లాప్ ఖాతాలో వ‌చ్చి చేరింది.

రావణాసుర : గ‌తేడాది 'ధమాకా'తో విజయాన్ని అందుకున్న రవితేజకు 'రావణాసుర' చిత్రం నిరాశను మిగిల్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా థియేట‌ర్ల వ‌ద్ద ఎటువంటి ప్ర‌భావాన్ని చూప‌లేదు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ. 22 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

రామ బాణం : గోపీచంద్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీవాస్. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేష‌న్‌లో గ‌తంలో ల‌క్ష్యం, లౌక్యం వంటి హిట్లు వ‌చ్చాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రూ.50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల కంటే తక్కువ వసూలు చేసి.. 2023లో నిర్మాతలకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఏజెంట్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో విజయాన్ని అందుకున్న అఖిల్‌.. మ‌రో హిట్ కోసం యాక్ష‌న్ మూవీ ఏజెంట్‌ను చేశాడు. సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా అఖిల్‌కు, నిర్మాతకు భారీ నిరుత్సాహాన్ని మిగిల్చింది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ ప్రాజెక్ట్ వ‌ల్ల నిర్మాత అనీల్ సుంక‌ర‌కు రూ.30 కోట్లకు పైగా న‌ష్టం వాటిల్లింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఆదిపురుష్ : విడుద‌ల‌కు ముందు ప్ర‌భాస్ న‌టించిన‌ 'ఆదిపురుష్' టాలీవుడ్, బాలీవుడ్‌లో నానా హంగామా సృష్టించింది. కానీ విడుద‌ల త‌ర్వాత హంగామా కాస్తా సైలెన్స్ అయిపోయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రూ. 160 కోట్లకు కొనుగోలు చేసిన ఓ ప్రొడక్షన్ హౌస్.. రూ.60 కోట్ల నష్టాన్ని చవిచూసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ. 700 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆదిపురుస్.. బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం రూ. 450 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసింది. దీంతో చిత్ర నిర్మాత‌లు భారీగా న‌ష్టాన్ని చ‌విచూశారు.

ఈ సినిమాలే కాక ఎమ్.ఎస్.రాజు దర్శకత్వంలో నరేష్-పవిత్ర జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి', కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన 'అమిగోస్', కిరణ్ అబ్బవరం 'మీటర్', సందీప్ కిషన్ 'మైఖేల్', సుధీర్ బాబు 'వేట' సినిమాలు భారీ ప‌రాజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.


Next Story