జగన్ జీ.. దీనికి సమాధానం చెప్పగలరా..?
By రాణి Published on 30 Dec 2019 8:14 AM GMTహెరిటేజ్ సంస్థ, మాజీ సీఎం చంద్రబాబు ముఖ్య అనుయాయులు, మరికొంత మంది కలిసి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రధానంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా బుగ్గన ఇచ్చారు. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు కానుందన్న విషయం తెలుసుకుని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రభుత్వం సేకరించిన వివరాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.
అయితే, ప్రభుత్వ ముందస్తు సమాచారం మేరకు అభివృద్ధి చెందనున్న ఆస్తులను కొనుగోలు చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు రకాల కొనుగోలు జరిగాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో కూడా చెప్పారు. అందులో ఒకటి చంద్రబాబు హెరిటేజ్ కంపెనీతోపాటు ఆయన సన్నిహితులు, బినామీలు, తదితరులు సైతం అమరావతిలో భూములను కొనుగోలు చేసి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.
ఇక రెండోది, బుగ్గన లెక్కల ప్రకారం రాజకీయ నాయకుల కారు డ్రైవర్లు, ఇంట్లో పనోళ్లు, ఆఖరకు వైట్ కార్డు ఉన్న వారు సైతం భూములు కొనుగోలు చేశారన్నారు. అయితే, ఈ రెండింటిలో మొదటిదానిని ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. పొలిటికల్‌గా మాత్రం ఇట్టే అర్ధమైపోతుంది. అలాగే ఎక్కడో రాయలసీమ అనంతపురం నుంచి వచ్చి అమరావతిలో భూములు ఎందుకు కొనుగోలు చేశారు..? మరీ ముఖ్యంగా 29 గ్రామాల్లో తుళ్లూరుపై దృష్టి ఎవరికీ లేదు, అటువంటిది ప్రత్యేకించి అక్కడే ఎందుకు భూములను కొనుగోలు చేశారు..? అన్న ప్రశ్నలు ఖచ్చితంగా కొంత అనుమానం కలగక తప్పదు. కనుక, రాజకీయంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను ఎస్టాబ్లిష్ చేయొచ్చునేమో కానీ.., న్యాయబద్దంగా నిరూపించడం మాత్రం కష్టమే. తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకముందు అక్కడి పరిసర ప్రాంతాల్లో భూములు కొన్న వారు వారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో రాజధాని వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే తుళ్లూరులో భూములు కొంటున్నామని రాయరు కదా..? అన్నది రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న అంశం. భూములు కొన్న వారు ఆల్రెడీ చాలా చోట్లనే కొన్నాను. ఆ క్రమంలో ఇక్కడా కొంటున్నాను అంటూ చెప్పుకొస్తారే కానీ.. అసలు నిజాన్ని బయటపెట్టరు.అందువల్ల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను లీగల్‌గా ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి.
ఒకవేళ ఆదాయ వనరులు తక్కువ ఉండి.. ఎక్కువ ఆస్తులు కలిగిన వారు ఖచ్చితంగా కరప్షన్ వ్యక్తుల కిందికే వస్తారు. ఆ రకంగా ఎవరైనా బయటపడే అవకాశం ఉంది. అటువంటి సమాచారం బయటకు వచ్చినప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగుతారు. మీకు డబ్బులు లేకపోయినా.. ఇన్ని పొలాలు ఎలా కొన్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతల ప్రముఖుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లు, పనిమనుషుల మీద ఎన్‌క్వైరీ చేయొచ్చు. అంతేతప్ప ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను అనుమానాలతో తప్ప ఆధారాలతో బయటపెట్టడం వీలుకాదన్నది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.