ముగిసిన ఎన్నికల ప్రచారం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 19 Oct 2019 5:23 PM IST

ముగిసిన ఎన్నికల ప్రచారం

సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో జరిగే ఉప ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచార మైక్‌లు మూగబోయాయి. చివరి రోజు కావడంతో పోటీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల రోడ్‌ షోలు, ఇంటింటా ప్రచారంతో హుజూర్‌నగర్‌ మారు మ్రోగిపోయింది. కీలక నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకూ ఎమ్మెల్యే అభ్యర్థులు చెమటోడ్చారు. హుజుర్‌నగర్‌ బరిలో 28 మంది అభ్యర్థులున్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉంది. ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికతో పాటు హర్యానా, మహారాష్ట్రలో కూడా ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరి రోజు కావడంతో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో 288 స్థానాలు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమిగా పోటీలో నిలిచారు. కాగా దేశవ్యాప్తంగా మరో 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 21న ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి వచ్చిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్‌ 24న కౌంటింగ్‌ అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.

Next Story