కరోనా ఎఫెక్ట్ .. బయోమెట్రిక్‌ హాజరు విధానంకు స్వస్తి!

By Newsmeter.Network  Published on  13 March 2020 3:53 AM GMT
కరోనా ఎఫెక్ట్ .. బయోమెట్రిక్‌ హాజరు విధానంకు స్వస్తి!

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై పడుతుంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను కరోనా వైరస్‌ వణికిస్తుంది. ఇప్పటికే భారత్‌లో ఈ వైరస్‌ భారిన పడి ఒకరు మృతిచెందగా 85కు పైగా వైరస్‌ నిర్దారణ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఓ యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో నెల్లూరు పట్టణ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సినిమా థియేటర్‌లను మూసివేయించారు. ఇలా అన్ని విధాల ఏపీ ప్రభుత్వం, అధికారులు వైరస్‌ వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. బయోమెట్రిక్‌ హాజరు విధానం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బయోమెట్రిక్‌ హాజరు విధానంకు బదులు ఫిజికల్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. ఈ మేరకు సీఎం అదనపు కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలాఉంటే తెలంగాణలోనూ పలు విభాగాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని నిలిపివేశారు. కరోనా ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో వ్యక్తికి కరోనా సోకినట్లు ఎలాంటి నిర్దారణ కాకపోయినప్పటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు పలువురు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరికి వైరస్‌ సోకినట్లు నిర్దారణ కాకపోయినా ప్రభుత్వంసైతం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్‌ వేలిముద్రల సాయంతో హాజరును తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది. యూజీసీ నుంచి ఆదేశాలతో అధికారులు ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలా కరోనా వైరస్‌ ప్రభావం అన్ని విభాగాలపైనా పడుతుంది.

Next Story
Share it