తెలంగాణ లోని షాద్ నగర్ లో దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పై టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సమంత, దర్శకులు పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, హీరోలు మంచు మనోజ్, బాలకృష్ణ, వెంకటేష్ నాని, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రాశీఖన్నా, నాగార్జున, కల్యాణ్ రామ్, విశాల్ , నిఖిల్, మంచు లక్ష్మి, రిషి కపూర్, బన్నీవాస్ తదితరులు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీపీ సజ్జనార్ ను అభినందించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా నిందితులను వదిలిపెట్టకుండా ఎన్ కౌంటర్ చేయాలన్నారు. మగపిల్లలను చిన్నప్పటి నుంచే అదుపులో ఉంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. దిశకు నిజంగా ఈ రోజు న్యాయం జరిగిందని, చెల్లెమ్మా నీ ఆత్మకు ఈ రోజు శాంతి చేకూరుతుందని ఆశించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…మున్ముందు కూడా అవసరమైతే ఇలాంటి శిక్షలు బహిరంగంగా అమలు చేయాలని కోరారు. రేపిస్టులను చంపిదిశకు న్యాయం చేశారని, ఆమె ఆత్మకు ఇప్పుడే శాంతి చేకూరుతుందన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందిస్తూ..పోలీసులు నిజమైన హీరోలని కొనియాడారు. ఆపదలో ఉన్నప్పుడు రక్షించమని దేవుడిని వేడుకున్నా పంపించేది పోలీసులనేనన్నారు. కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడని, తెలంగాణ పోలీసులకు చేతులెత్తి మొక్కుతున్నానని పూరీ ట్వీట్ చేశారు. హీరో బాలకృష్ణ సీపీ సజ్జనార్, పోలీస్ యంత్రాగాన్ని అభినందించారు. దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని, ఇటువంటి నిందితులకు ఇదే సరైన శిక్ష అని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా హీరోయిన్ సమంత తన స్పందనను తెలియజేసింది. దిశ అత్యాచారానికి గురైన రోజు తాను స్పందించలేదని, తననొక దోషిగా చూశారంటూ ట్వీట్ చేసింది. ఒక్కొక్కసారి భయం సమస్యలకు సొల్యూషన్ చూపిస్తుందని, ఇప్పుడు ఆ భయమే ఆ నిందితులను ఎన్ కౌంటర్ చేసేందుకు సహాయం చేసిందన్నారు.

హీరో నాని, జూనియర్ ఎన్టీఆర్ లు దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిందితుల ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసోడు అయి ఉండాలి అని హీరో నాని ట్వీట్ చేసి, తెలంగాణ పోలీసులను అభినందించారు. దిశకు ఇప్పుడే న్యాయం జరిగిందని హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు. హీరో అక్కినేని నాగార్జున దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు. ఉదయం లేవడంతోనే మంచి వార్త విన్నానని నాగార్జున తెలిపారు. రేపిస్టుల ఎన్ కౌంటర్ తో దిశకు, ఆమె కుటుంబానికి సరైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ తెలంగాణ పోలీసులకు పెద్ద సెల్యూట్ అని ట్వీట్ చేశారు. చెల్లెమ్మా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మేము నిన్ను కాపాడలేకపోయినా…ఈరోజు నీకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

హీరో కల్యాణ రామ్ స్పందిస్తూ..దిశకు, ఆమె కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడల్చలేనిది. కానీ ఈ రోజు జరిగిన ఎన్ కౌంటర్ తో వారికి న్యాయం జరిగిందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. హీరో విశాల్ కూడా దిశ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులను ఆయన అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెలంగాణ పోలీస్ యంత్రాగాన్ని, సీపీ సజ్జనార్ ను అభినందించారు. తప్పు చేసిన వారికి, చేయాలన్న ఆలోచన వచ్చే వారికి ఈ భయం చాలా అవసరమన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. మా సినిమాల్లో టీజర్స్, ట్రైలర్స్ లైక్ చేయకపోయినా పర్లేదు కాని దిశ నిందితుల ఎన్ కౌంటర్ న్యూస్ మాత్రం ట్రెండింగ్ చేయాలని ఆయన వేడుకున్నారు. హీరో నిఖిల్ స్పందిస్తూ…అన్యాయం జరిగిన చోట న్యాయం చేసేందుకే లా సృష్టించబడిందన్నారు.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆశించారు. మరోసారి ఇలా చేయాలన్న ఆలోచన వచ్చిన వారికి ఈ ఎన్ కౌంటర్ గుర్తురావాలన్నారు. నటి మంచు లక్ష్మి ఈ ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ లో స్పందించారు. చాలా సంవత్సరాలుగా తాను ఎన్ కౌంటర్ అనే పద్ధతికి వ్యతిరేకినన్నారు. కానీ ఈ రోజు జరిగిన రేపిస్టుల ఎన్ కౌంటర్ ను చూశాక తన మైండ్ ను మార్చుకున్నానన్నారు. దిశకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ తీసుకోవడం పై ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ఈ ఎన్ కౌంటర్ పై స్పందించారు. తెలంగాణ పోలీసుల పనితీరును ఆయన అభినందించారు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ ఈ ఘటనపై ట్విట్టర్ లో స్పందిస్తూ..మృగాలను సరైన దిశలో వేటాడిన మగాళ్లు అంటూ తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు.

ఇటీవల కాలంలో తెలంగాణలోని షాద్ నగర్ ప్రాంతంలో నలుగురు రాక్షసుల బారిన పడి దిశ అనే వెటర్నరీ డాక్టర్  అత్యాచారానికి గురై  మృతి చెందింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే నలుగురు దుర్మార్గులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. దిశ ఉదంతం తెలిసినప్పటి నుంచి రాష్ర్టంలో భద్రతను కట్టుదిట్టం చేసింది తెలంగాణ పోలీస్ యంత్రాంగం. శుక్రవారం ఉదయం దిశను హతమార్చిన ప్రదేశంలో పోలీసులు నిందితులను తీసుకువెళ్లి సీన్ రీకన్స్ర్టక్షన్ చేస్తున్న సమయంలో నలుగురు నిందితులు  పోలీసులపై తిరగబడటంతో వారిని అక్కడికక్కడే ఎన్ కౌంటర్ చేశారు.

నిందితుల ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ యంత్రాగాన్ని అభినందిస్తున్నారు. దిశ కాలనీ వాసులు, నిందితుల కుటుంబ సభ్యులు, రాష్ర్ట ప్రజలంతా సీపీ సజ్జనార్ ను ప్రశంసిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తదితరులంతా పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిశ కాలనీ వాసులు పోలీసులకు స్వీట్లు తినిపించి పండుగ చేసుకున్నారు. ఇకపై ఎక్కడైనా ఆడపిల్లపై అఘాయిత్యం జరిగితే ఇదే పద్ధతిలో నిందితులను శిక్షించాలంటూ ప్రజలంతా పోలీసులను కోరుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.