ఆసరా ఎటువంటి భూములు అమ్మలేదు.. డబ్బు తిరిగివ్వలేదు  

By Newsmeter.Network  Published on  19 Feb 2020 1:17 PM GMT
ఆసరా ఎటువంటి భూములు అమ్మలేదు.. డబ్బు తిరిగివ్వలేదు  

ఎమ్మార్ స్కామ్ లో సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు 45 కోట్లు అందిందని.. వాటిలో 36కోట్ల రూపాయలు ఇండస్ట్రియలిస్ట్ ఇందుకూరి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన ఆసరా థీమ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తోంది. సౌత్ ఎండ్ గ్రూప్ లోకి మొత్తం 11 కంపెనీల ద్వారా 45 కోట్లు తరలించారని ఆ కంపెనీలు మొత్తం బోగస్ కంపెనీలేనని.. ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఆ కంపెనీలు ఎటువంటి లావాదేవీలు జరపలేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. డబ్బులు ఎలా చేతులు మారాయి.. బోగస్ కంపెనీలు ఎలా సృష్టించారు అన్న విషయాలు ఈడీ తెలంగాణ హైకోర్టుకు సమగ్రంగా తెలిపింది.

ఎమ్మార్ కేసు నిందితుల జాబితాలో ఈడీ తమ కంపెనీ పేరును చేర్చిందని, ఆ కేసును కొట్టివేయాలంటూ ఆసరా సంస్థ డైరెక్టర్ ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మార్ ద్వారా ఆర్జించిన నేరపూరిత సొమ్ము ఆసరా కంపెనీ వద్ద ఉందని ఈడీ వెల్లడించింది. అందువల్ల ఆసరా కంపెనీపై ఈడీ కేసును కొట్టివేయాలన్న పిటిషన్ ను తిరస్కరించాలని కోరింది. దీనిపై ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.ఫణికుమార్ కౌంటరు దాఖలు చేశారు.

సౌత్ ఎండ్ గ్రూప్ ఆసరా కంపెనీకి భూముల కొనుగోలుకై 36 కోట్లు పంపింది. కానీ ఇప్పటి వరకూ ఎటువంటి భూములు సౌత్ ఎండ్ గ్రూప్ తరపున రిజిస్టర్ చేయించలేదు. ఆసరా కంపెనీ నుంచి రాయ్ దుర్గ్ లోని 4.01 ఎకరాలను కొనడానికి సౌత్ఎండ్ ప్రాజెక్ట్స్ అడ్వాన్స్ గా రూ. 36.82 కోట్లు చెల్లించి ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత రెండేళ్లయినా ఆ సొమ్ము గురించి పట్టించుకోనేలేదు. ఆ భూమిని సంధ్య హోటల్స్ కు ఆసరా కంపెనీ అమ్మేసినా అడ్వాన్స్ గా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వలేదు. సౌత్ ఎండ్ నుండి ఆసరాపై ఎటువంటి ఫిర్యాదులూ చేయలేదు. ఎమ్మార్ కు చెందిన నేరపూరిత సొమ్ము రూ. 36.82 కోట్లు ఆసరాలో ఉందని ఈడీ బలంగా వాదించింది. వీటిని సాక్ష్యాలుగా పరిగణించాలని.. ఆసరా గ్రూప్ దగ్గరే గత రెండేళ్లుగా 36 కోట్ల రూపాయలు ఉన్నాయని ఈడీ కౌంటర్ లో చెప్పుకురావడమే కాకుండా శ్యామ్ ప్రసాద్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. కోర్టు ఈ కేసును ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది.

Next Story