విజయ్ కోరికకు ఓకే చెప్పిన మహిళా క్రికెటర్
By తోట వంశీ కుమార్ Published on 4 May 2020 11:32 AM ISTటీమ్ఇండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మురళీ విజయ్ కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. కాగా.. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఎలిస్ పెర్రీ స్పందించింది.
కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన విజయ్‌ను కొద్ది రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో కొన్ని ప్రశ్నలు వేసింది. ఏ ఇద్దరు క్రికెటర్లతో కలిసి డిన్నర్ చేయాలని ఉందని అనే ప్రశ్న విజయ్‌కు ఎదురైంది. భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీతో డిన్నర్ చేయాలని ఉందని విజయ్ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా పెర్రీ చాలా అందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
తాజాగా సోని స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలిస్ పెర్రీకి విజయ్‌తో డిన్నర్ ప్రశ్న ఎదురైంది. దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ ఆసీస్ మహిళా క్రికెటర్. విజయ్ డిన్నర్ ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. కానీ బిల్ మాత్రం అతనే పే చేస్తాడని భావిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆ డిన్నర్ బిల్ విజయ్ చెల్లిస్తాడనుకుంటున్నా. అతనేం వెనుకాడే మనిషి కాదు. అతని డిన్నర్ చేస్తే ఉబ్బితబ్బిబ్బవుతా.'అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెటింట్లో వైరల్ గా మారాయి. ఇక ప్రపంచకప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా.. యాషెస్ సిరీస్కు ఇస్తారా అని ప్రశ్నించగా.. యాషెస్ అని తెలిపింది. భారత మహిళా జట్టు యువ సంచలనం పెషాలీ వర్మపై పెర్రీ పై ప్రశంసలు కురింపించింది. పెషాలీలో అసాధారణ టాలెంట్ ఉందని, అలాంటి క్రీడాకారిణీ తమ జట్టులో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఎలిస్ పెర్రీ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే.. గాయంతో ఫైనల్‌కు దూరమైంది. ఫైనల్‌లో భారత్ పై ఆసీస్ మహిళా జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ చివరి సారి భారత్ తరుపున 2018 డిసెంబర్‌లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ ఉండడంతో.. విజయ్‌కు అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉంటే.. తాను దేశం కోసం ఆడాలని ఏనాడు కోరుకోనని, ఫ్యాషన్ కోసం మాత్రమే క్రికెట్ ఆడతానంటూ విజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.