అలా చేస్తే ఏం కాదా..? కరోనా టిప్స్ చెప్పిన ఎలిజబెత్
By Newsmeter.Network
కరోనా.. ఈ పదం వింటేనే ప్రపంచ దేశాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడ మనకు వైరస్ వ్యాపిస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. చైనా, ఇటలీలాంటి దేశాల్లో ప్రజలు బయటకు రావటమే మానేశారంటే ఈ కరోనా వైరస్ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ వైరస్ భారిన పడి 4వేల మందికి పైగా మృత్యువాత పడగా, లక్షముప్పై వేల మంది కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకున్న వారు కూడా ఉన్నారు.
కానీ ఈ వైరస్ ఒక్కసారి సోకితే ప్రమాదం పొంచి ఉన్నట్లేనని భావించాల్సి ఉంటుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలుసైతం ప్రజలను అప్రమత్తం చేశాయి. తాజాగా కరోనా వైరస్ భారిన పడి చికిత్స తీసుకొని అమెరికాకు చెందిన 37ఏళ్ల మహిళ ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. అమెరికాలోని సియాటెల్‌లో బయో ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ ఎలిజబెత్ ఫ్నెయిడర్ ఫిబ్రవరి 22న ఓ పార్టీకి వెళ్లింది. మూడు రోజుల తరువాత ఫిబ్రవరి 25న ప్లూ మాదిరి లక్షణాలు కనిపించాయి. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో అనుమానంతో మెడిసిన్ తీసుకుంది. అయిన తగ్గలేదు. ఆ తర్వాత ఆపార్టీలో పాల్గొన్న చాలా మందికి కూడా అవే లక్షణాలు కనిపించాయి. చివరికు మార్చి 7న ఆమెకు కరోనా ఉన్నట్లు నిర్దారణ అయింది.
దీంతో వైద్యులు చెప్పిన సూచనలు పాటించిన ఆమె కొద్దిరోజుల్లోనూ పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా ఆమె కరానో వైరస్‌పై చేసిన వీడియో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ వల్ల భయపడాల్సిన పనిలేదని, కొద్దిపాటి టిప్స్ పాటిస్తే సరిపోతుందని ఆమె ఈ వీడియో ద్వారాతెలిపింది. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇలా ఉంటే వైద్యులను సంప్రదించాలని ఎలిజబెత్ సూచించింది. వైద్యుల సూచనలు పాటించాలని, మీ ఆరోగ్య సూచీలు మరీ ప్రమాదకరంగా ఉంటే తప్ప ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని తెలిపింది. ఎక్కువగా నీళ్లు తాగాలని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని , భయాందోళన చెందవద్దని కరోనా నుంచి బయటపడిన ఎలిజిబెత్ తన ఫేస్‌బుక్ వీడియో పోస్టు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకూడా ఎలిజిబెత్ వీడియోను షేర్ చేసింది.