రెండు నెలల కాలంలో 350 ఏనుగులు మరణం: అందరిలో టెన్షన్

By సుభాష్  Published on  2 July 2020 9:52 AM GMT
రెండు నెలల కాలంలో 350 ఏనుగులు మరణం: అందరిలో టెన్షన్

రెండంటే రెండు నెలలో కాలంలో ఏకంగా 350 ఏనుగులు మరణించడం శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నాయి. బొత్స్వానాలో కేవలం రెండు నెలల సమయంలో ఇన్ని జంతువులు మరణించడం పట్ల శాస్త్రవేత్తలే కాకుండా పలువురు జంతు ప్రేమికులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం లోని ఈ దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జంతువులు చనిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ ఏనుగుల కళేబరాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ఆ ఏనుగుల మీద ఎవరైనా దాడి చేసినట్లు కానీ, చంపినట్లు కానీ గాయాలు లేవు. ఎవరైనా ఏనుగులకు విషం పెట్టారా అనే విషయంపై కూడా అధికారులు ఆరాతీస్తున్నారు. రిపోర్టుల కోసం ఎదురుచూస్తూ ఉన్నామని అధికారులు తెలిపారు.

రీజనల్ వైల్డ్ లైఫ్ కో-ఆర్డినేటర్ దిమకాట్సో నషేబే మాట్లాడుతూ ఏనుగుల మరణానికి ఏమి కారణమో తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని అన్నారు. ఏనుగుల నాడీ వ్యవస్థపై ఏదో ప్రభావం చూపుతోందని అందుకే అవన్నీ ముఖాల మీద కుప్పకూలుతూ ఉన్నాయని బిబిసి రిపోర్ట్ లో డాక్టర్ నియాల్ మెక్ కాన్ తెలిపారు. ఆంత్రాక్స్ ద్వారా మరణాలు సంభవించాయా అన్న అనుమానాలు వ్యక్తం అవ్వగా అదేమీ కాదని అధికారులు స్పష్టం చేశారు. జూన్ నెల మధ్యలో 169 మరణాలు సంభవించగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. నీటి కుంటలకు దగ్గరగా 70 శాతం ఏనుగుల మృతదేహాలు కనిపించాయి. ఆడ, మగ అన్న తేడా లేకుండా ఏనుగుల మరణాలు సంభవించాయని స్థానికులు తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తూ ఉండడంతో ఏనుగుల మూక మరణాలపై ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనుషుల నుండి జంతువులకు ఏదైనా వైరస్ పాకిందా అని కూడా అధికారులు ఆరాతీస్తున్నారు.

ఆఫ్రికా ఖండంలో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చినప్పటికీ బొత్స్వానా దేశంలో మాత్రం ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1990ల్లో 80000 ఉన్న ఏనుగుల సంఖ్య 1,30,000కు పైగా చేరుకుంది. ఇప్పుడు ఇలా ఏనుగుల మరణాలు సంభవిస్తూ ఉండడంతో రీసెర్చర్లలో కలవరం మొదలైంది.

Next Story