చిన్నతనంలో ఐన్ స్టీన్ నిజంగా గణితంలో తప్పాడా??
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Oct 2019 7:08 PM ISTఆల్బర్ట్ ఐన్ స్టైన్, ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరంలేని పేరు. సైన్స్ చదివేవారికి ఆరాధ్యదైవం. సైన్స్ అంతగా తెలియనివారికి కూడా ఆదర్శంగా నిలిచిన అద్భుత వ్యక్తిత్వం. ఆయన జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. మార్చి 14,1879 న జన్మించాడు. 300కు పైగా శాస్త్రీయ విషయాలు ముద్రించారు.
అయితే, ఐన్ స్టీన్ చిన్నతనంలో మాథెమాటిక్స్ లో ఫెయిల్ అయ్యేవాడని, మానసిక వైకల్యంతో బాధపడే వాడని విస్తృతంగా ప్రచారంలో ఉంది. డీస్లెక్సియా అనే వ్యాధితో బాధపడేవాడని.. అయినా పట్టుదలతో చదివి గొప్ప శాస్త్రవేత్త అవ్వగలిగాడని చెబుతారు. కాని, ఐన్ స్టీన్ జీవిత చరిత్ర రాసిన రోనాల్డ్ క్లార్క్, అబ్రహం పాయిస్ ఈ వదంతులన్నింటినీ ఖండిస్తున్నారు. వారి ప్రకారం ఆయన రెండు, మూడు ఏళ్లకే వాక్యాలు మాట్లడేవాడట. అయితే, ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని కారణంగా అందరూ అతనిని తప్పుగా అర్ధం చేసుకున్నారు.
ప్రతిభావంతుడైన విద్యార్ధి, మంచి నడవడితో ఉండేవాడు. కాని, తన మేధావిత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడు కాదు. ఐన్ స్టీన్ నాలుగవ తరగతిలో గణితంలో ఫెయిల్ అయ్యాడు అనడం మాత్రం తప్పుడు వార్త.
జూరిచ్ లోని ఫెడేరల్ పాలిటెక్నిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసినప్పుడు గణితం, విజ్ఞాన శాస్త్రాలలో అద్భుతంగా మార్కులు సంపాదించాడు. అయితే, మిగితా విషయాలలో మార్కులు సరిగా రాకపోవడంవల్ల అక్కడ ప్రవేశం దొరకలేదు. ఆర్గావ్ లోని చాంటొన్ స్కూల్ లో చదువు కొనసాగిస్తూనే జూరిక్ స్కూల్లో ప్రవేశం కోసం ఎంతో ప్రయత్నించాడు.
1896, ఆర్గావ్ లోని స్కూల్లో ఐన్ స్టీన్ ఆఖరు సంవత్సరం. ఆ సంవత్సరంలో స్కూల్లో మార్కులు వేసే (గ్రేడింగ్) పద్దతి మారిపోయింది. ‘1’ గ్రేడ్ వస్తే అతి తక్కువ మార్కులు వచ్చినట్లు, అదే ‘6’ గ్రేడ్ వస్తే ఉత్తమంగా మార్కులు వచ్చినట్టు. ఇదివరకు సంవత్సరాల్లో గ్రేడింగ్ దీనికి వ్యతిరేకంగా ఉండేది.
17 ఏళ్లకి ఐన్ స్టీన్ అద్భుతమైన మార్కులు తెచ్చుకున్నాడు. కానీ, ఆ స్కూల్ గ్రేడింగ్ మారిన విషయం తెలియనివారు దీనిని అపార్ధం చేసుకొని తప్పుడు ప్రచారం చేశారు. దాదాపు వంద సంవత్సరాల నుంచి ఇంకా ఈ ప్రచారం కొనసాగుతోంది. ఇప్పుడు 1896 లోని ఆయన రిపోర్ట్ కార్డ్ ను పరిశీలించి చూస్తే అర్ధం అవుతుంది