లాక్‌డౌన్‌ బూచీతో అడ్డగోలుగా ధరలు.. కొండెక్కిన కోడిగుడ్డు

By అంజి  Published on  6 April 2020 3:19 AM GMT
లాక్‌డౌన్‌ బూచీతో అడ్డగోలుగా ధరలు.. కొండెక్కిన కోడిగుడ్డు

తెలంగాణ రాష్ట్రంలో చికెన్‌తో పాటు గుడ్డు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. హోల్‌సేల్‌ ధరల్లో రూ.3కే దొరికే గుడ్డు బయటి మార్కెట్‌లో రూ.6కు చేరుకుంది. చికెన్‌, గుడ్లతో కరోనా వైరస్‌ సోకదంటూ ప్రభుత్వం, మీడియా విశేంగా ప్రచారం చేశాయి. దీంతో ప్రజల్లో కోడిగుడ్లు తినాలనే అవగాహన పెరిగింది.

గుడ్డులో చాలా ప్రోటీన్స్‌ ఉంటాయి. అందుకే ప్రతి పేదోడి నుంచి పెద్దోడి వరకు అందరూ తింటారు. అయితే పట్టణాల్లో, గ్రామాల్లో పేద, మధ్యతరగతి ప్రజలు హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాల వెళ్లి గుడ్డు ధర విని తేలగుడ్లు వేస్తున్నారు. ధరలు పెరగడంతో సామాన్యులు గుడ్లు తినే పరిస్థితి కనిపించడం లేదు.

కోళ్ల పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావం చూపుతోంది. అయితే ఒక్కసారిగా గుడ్డు ధర రూ.6లకు చేరడం ట్రేడర్లు, కిరాణా వ్యాపారులు, దళారుల చేతి వాటమేనన్న ఆరోపణలు వినబడుతున్నాయి. రైతుల దగ్గర ఒక గుడ్డు రూ.3కే లభ్యం అవుతోంది. కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ బూచీని చూపిస్తూ వ్యాపారులు గుడ్డు ధరను పెంచేశారు. ఒక్కో గుడ్డుపై రూ.3 లాభం పొందుతున్నారు.

ఓ వైపు కోళ్లకు దాణగా పెట్టే ఆయిల్‌సీడ్స్ ప్రోటీన్స్ కోసం చేసే సోయా అయిల్ కేక్, డీయాఆర్టీ దొరక్క పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతుంటే.. లాక్‌డౌన్‌ను ఆసరగా చేసుకొని దళారులు వారిని ముంచుతున్నారు. ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్‌ కమిషన్‌, రిటైలర్‌ కమీషన్‌ అంతకలిపి 75 పైసలు ఖర్చు అవుతోంది. వినియోగదారుడి వద్దకు వచ్చే సరికి ఆ గుడ్డు ధర రూ.6లు పలుకుతోంది. దీంతో అటు రైతులు, ఇటు వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మార్చి నెలాఖరులో పౌల్ట్రీ రైతుల నుంచి ట్రేడర్లు రూ.1.50 నుంచి రూ.1.75 పైసలకే గుడ్లను కొన్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొడిగుడ్డు ధర రూ.3కు చేరింది.

తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామని చెప్పుకుంటు వస్తున్న మాటలు ఆచరణలో సాధ్యం కావడం లేదని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it