'టీఎస్ ఎంసెట్' ఆ నెల‌లోనే నిర్వహించే అవకాశం..!

TS EAMCET likely to be conducted in June. తెలంగాణలో ఎంసెట్‌ జూన్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

By Medi Samrat  Published on  9 Feb 2022 5:26 AM GMT
టీఎస్ ఎంసెట్ ఆ నెల‌లోనే నిర్వహించే అవకాశం..!

తెలంగాణలో ఎంసెట్‌ జూన్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ పరీక్షలు మే 5న ముగుస్తున్నందున.. విద్యార్థులకు ఎంసెట్‌కు ముందు నాలుగు వారాల సమయం కూడా దొరుకుతుంది. జేఈఈ మెయిన్ టైమ్‌టేబుల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్‌సీహెచ్ఈ) షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ఈ రెండు ప్రవేశ పరీక్షలకు రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నందున ఎంసెట్‌, జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు వేర్వేరు తేదీల‌లో ఉండేలా చూసుకోవాలి.

రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు.. టీఎస్‌సీహెచ్ఈ ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ ఎ గోవర్ధన్‌ను కన్వీనర్‌గా నియమించింది. ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష‌, ప్రవేశాల నిర్వహణకు బాధ్యత వహించే అడ్మిషన్ కమిటీని కూడా కౌన్సిల్ ఏర్పాటు చేసింది. త్వరలో కమిటీ సమావేశమై షెడ్యూల్ ఖరారు చేసి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

ఎంసెట్‌ కాకుండా.. జూన్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లోకి లాటరల్-ఎంట్రీ అడ్మిషన్ల కోసం డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ అభ్య‌ర్ధుల‌ కోసం తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను కూడా టీఎస్‌సీహెచ్ఈ నిర్వహించాలని యోచిస్తోంది. జూన్‌లో తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌పీజీఈసెట్‌) నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మే 5న ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నాలుగు వారాల తర్వాత ఎంసెట్‌ నిర్వహించాల‌ని అధికార వ‌ర్గాలు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.


Next Story