తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

TS EAMCET 2022 Result release.తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈ సెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. జేఎన్‌టీయూహెచ్ ప్రాంగ‌ణంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 6:42 AM GMT
తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈ సెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. జేఎన్‌టీయూహెచ్ ప్రాంగ‌ణంలో విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జూలై 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, జూలై 30,31 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంట్రన్స్‌ పరీక్షలను నిర్వహించారు. అలాగే ఇంజనీరింగ్‌ రెండో ఏడాది కోర్సులో ప్రవేశాల (లేటరల్‌ ఎంట్రీ) కోసం ఆగస్టు 1న ఈసెట్‌ను నిర్వహించారు. ఈసెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు ఎంసెట్‌ ఫలితాల కోసం https://eamcet.tsc-he.a-c.in, ఈసెట్‌ ఫలితాల కోసంం https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడొచ్చు.

ఫ‌లితాలను విడుద‌ల చేసిన అనంత‌రం మంత్రి స‌బిత మాట్లాడారు. ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎంసెట్‌ నిర్వహించామని చెప్పారు. పరీక్షలకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు. త్వ‌ర‌లోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఉన్న‌త విద్య‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసే కౌన్సిలింగ్ సెంట‌ర్‌లో క‌ళాశాల‌లు, కోర్పుల వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా‌.. ప‌రీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా.. 80,575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ మొద‌టి ర్యాంక్ సాధించ‌గా.. అగ్రిక‌ల్చ‌ర్ విభాగంలో నీహ ఫస్ట్‌ ర్యాంక్ సాధించింది.

Next Story