Telangana: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్
తెలంగాణలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
By - అంజి |
Telangana: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్
తెలంగాణలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఊరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కేటాయించారు. దీని ప్రకారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 9:05 నిమిషాల వరకూ కేంద్రంలోకి అనుమతిస్తారు, ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్‌పై ఉన్న QR కోడ్‌ను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వెలుతురు, ఫంక్షనల్ టాయిలెట్లు, బెంచీలు వంటి అన్ని సౌకర్యాలను కల్పించామని, ఏ విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రత కోసం ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాల నిఘా ఉండటంతో పాటు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తాయి.
పరీక్షల సమయంలో ఒత్తిడి లేదా ఆందోళనకు గురయ్యే విద్యార్థులు 'టెలీ-మానస్' (Tele-MANAS) టోల్ ఫ్రీ నంబర్ 14416 కు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు. సమాధాన పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) కూడా ఫిబ్రవరి 26 నుంచే 20 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లలోని వివరాలను సరిచూసుకోవాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా సరిచేయించుకోవాలని బోర్డు సూచించింది.